Begin typing your search above and press return to search.

జగన్ కు నాలుగు భాషలు వచ్చన్న వైసీపీ ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   23 July 2021 6:37 AM GMT
జగన్ కు నాలుగు భాషలు వచ్చన్న వైసీపీ ఎమ్మెల్యేలు
X
ఏపీ సీఎం జగన్ కు ఎన్ని భాషలు తెలుసు అన్నది ఖచ్చితంగా ఎవ్వరికి తెలియదు. కానీ నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావ్ కు మాత్రం తెలుసట.. ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు నాలుగు భాషలు వచ్చు అని.. దేశ ప్రధాని కావడానికి అన్ని అర్హతలు జగన్ కు ఉన్నాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

గృహ నిర్మాణంపై సమీక్షా సమావేశం సీఎం జగన్ నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యేలు జోగిరమేశ్, అప్పారావ్, మల్లాది విష్ణు తదితరులు హాజరయ్యారు. పనులను వేగవంతం చేయడానికి వారి సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్ చొరవ చూపారట.. ఈ క్రమంలోనే సీఎం జగన్ పై వారు ప్రశంసలు కురిపించారు.

ఈ క్రమంలోనే నూజివీడు ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ చేశారు. ‘సీఎం జగన్ కు నాలుగు భాషలు వచ్చు అని.. ఈజీగా మాట్లాడేస్తారని.. కానీ ఆ భాషలు ఏమిటి అనేది ప్రస్తావించలేనని నూజివీడు ఎమ్మెల్యే తెలిపారు. సీఎం జగన్ ఇప్పటికే తెలుగు, ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడగలరు. జగన్ కు కన్నడ కూడా టచ్ ఉందట.. బెంగళూరులో ఆయనకు ఇల్లు కూడా ఉన్న సంగతి తెలిసింది. ఇక కాస్త తమిళం కూడా తెలుసు అట..

ప్రధాన మంత్రిగా కావడానికి హిందీ రావడం తప్పనిసరి. ఎందుకంటే ఇది ఉత్తర భారతదేశంలో సర్వసాధారణమైన భాష. తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాల ప్రజలతో కమ్యూనికేట్ చేయడానికి హిందీ భాష రావడం అత్యవసరం. ఇదే దేశ రాజకీయాల్లో ప్రభావం చూపడానికి తోడ్పడుతుంది.

మరో ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ.. జగన్ మరో 30 సంవత్సరాలు ఏపీకి సీఎంగా కొనసాగుతారని.. అభివృద్ధి, సంక్షేమం పరంగా రాష్ట్రాన్ని ప్రగతిశీల దేశంగా మార్చడానికి తన మొత్తం సామర్థ్యంతో ప్రయత్నిస్తారని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలిద్దరూ చేసిన ప్రశంసలు చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్తులో మంత్రి పదవుల కోసమే ఇలా జగన్ ను ప్రధాని చేయబోతున్నారా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైనా జగన్ ను పొగడడం చూస్తుంటే అదే అనుకుంటున్నారు చాలా మంది.