Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పుట్టిన రోజు ఫ్లెక్సీల్లో వైసీపీ ఎమ్మెల్యే VS ఎమ్మెల్సీ వార్‌..!

By:  Tupaki Desk   |   21 Dec 2021 2:30 PM GMT
జ‌గ‌న్ పుట్టిన రోజు ఫ్లెక్సీల్లో వైసీపీ ఎమ్మెల్యే VS ఎమ్మెల్సీ వార్‌..!
X
ఏపీలో అధికార వైసీపీలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జ్వాలలు ఇప్పుడు ఎగిసిపడుతున్నాయి. చిత్తూరు జిల్లా నగ‌రి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా వర్గం, రోజాకు వ్యతిరేకంగా ఉన్న కేజీ కుమార్ వర్గం భారీ ఎత్తున ఫ్లెక్సీలు వేయించాయి. అయితే కుమార్ వర్గం వేయించిన ఫ్లెక్సీలను చించి వేయడంతో న‌గ‌రిలో పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది.

అయితే ఇప్పుడు గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పల్నాడులోని గురజాల నియోజకవర్గంలో కొద్దిరోజులుగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ జంగా కృష్ణమూర్తిని పక్కన పెట్టి మరి నరసరావుపేట నియోజక వర్గానికి చెందిన కాసు మహేష్ రెడ్డికి సీటు ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే కాసు మహేష్ రెడ్డి... జంగా కృష్ణమూర్తితో పాటు ఆయన వర్గాన్ని పక్కన పెడుతున్నారు.. అని నజంగా వర్గీయులు ఆరోపిస్తున్నారు.

తాజాగా దాచేపల్లి మండలం గామాలపాడు లో ఈనెల 21వ తేదీన సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వాగతం పలుకుతూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తనయుడు గామాలపాడు సర్పంచ్ సురేష్ పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అలాగే ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అనుచరుడు దాచేపల్లి నగర పంచాయతీ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పున్నారావు అభిమానులు జంగా సురేష్ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ పైన జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా మరో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తమ ప్లెక్సీ పైనే పున్నారావు అనుచరులు... మరో ప్లెక్సీ ఏర్పాటు చేయడంతో సర్పంచ్ సురేష్ అభిమానులు చైర్పర్సన్ ఫ్లెక్సీని చించివేశారు.

దీంతో చైర్పర్సన్ వర్గీయులు, సర్పంచ్ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలోనే పున్నారావు అనుచ‌రులు మాట్లాడుతూ... తమ‌ను కావాలనే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గం ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. ఏదేమైనా కొద్దిరోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ ఇద్దరు నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం... ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్ది రోజుల వరకు ఈ ఇద్దరు నేతలు కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

అయితే ఇప్పుడు నియోజకవర్గంలో పదవులతో పాటు కాంట్రాక్టులను ఎమ్మెల్యే తన వర్గానికి ఇప్పించుకోవడంతో ఎమ్మెల్సీ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచే పని చేసిన ఎమ్మెల్సీ జంగా ఇప్పుడు పిడుగురాళ్లలో తన కోసం ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ కేడర్ కూడా రెండుగా చీలిపోయింది.