Begin typing your search above and press return to search.

జగన్ - మోడీలపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   8 Feb 2021 10:00 PM IST
జగన్ - మోడీలపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X
ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పెద్ద యుద్ధమే నడుస్తోంది. దీన్ని ప్రైవేటీకరించవద్దంటూ కార్మికులు, సంఘాలు, ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ నేతలు సైతం మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొంటున్నారు.తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద జరిగిన కార్మికుల ఆందోళనలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

'130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించిన జగన్ కు మోడీ ఓ లెక్క కాదు' అంటూ వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని.. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేస్తామంటే ఊరుకోం అని అమర్ నాథ్ స్పష్టం చేశారు. తిరగబడే రోజులు వస్తాయని.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకుంటామని అమర్నాథ్ అన్నారు.

ఏపీలోని ప్రభుత్వ రంగ సంస్థ.. నవరత్న కంపెనీ అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడానికి కేంద్రం సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఈ మేరకు ప్రకటించారు. ఈ నిర్ణయం వెలువడగానే జాతీయ ఆంగ్ల పత్రికల్లో కథనాలు రావడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికవర్గం తీవ్ర ఆందోళన చెందింది.

రాష్ట్రంలో ప్రసిద్ధమైన స్టీల్ ఉత్పత్తిలో ప్రతిష్టాత్మకమైన మైలురాళ్లను దాటుతూ వైజాగ్ ప్లాంట్ ప్రగతి యావత్ దేశం గర్వించేలా ఉంది. అయినా దీన్ని అమ్మేయాలని నిర్ణయించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని తిప్పి కొడుతామని గుర్తింపు సంఘం నాయకులు అయోధ్య రామ్ అన్నారు.