Begin typing your search above and press return to search.

జర్నలిస్టులపై దాడులకు దిగుతున్న వైసీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   12 Aug 2019 1:00 PM IST
జర్నలిస్టులపై దాడులకు దిగుతున్న వైసీపీ ఎమ్మెల్యే
X
వైసీపీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరు రోజురోజుకీ వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే విలేఖరులను లక్ష్యంగా చేసుకుని ఆయన దాడులు చేయిస్తున్నారని.. బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ‘జమీన్ రైతు’ పత్రికాధిపతి - సీనియర్ జర్నలిస్ట్ నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ ఇంటిపై దాడిచేసి ఆయన్ను కొట్టడం సంచలనంగా మారింది.

జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ఇంటి‌పై ఎమ్మెల్యే కోటంరెడ్డి స్వయంగా దాడి చేశారని.. పెద్ద సంఖ్యలో అనుచరులను వెంటబెట్టుకుని వెళ్లిన ఆయన డోలేంద్రపై దాడికి దిగారని చెబుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై డోలేంద్ర పత్రికలో వరుసగ వ్యతిరేక కథనాలు వస్తున్నాయన్న కారణంతో ఆయన ఇలా దాడికి దిగారని చెబుతున్నారు. దీంతో నెల్లూరు జిల్లా కేంద్రంలో గుండాయిజం - రౌడీయిజం చేస్తు అరాచకం చేస్తున్న కోటంరెడ్డి పై చర్య తీసుకోవాలంటు జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొద్దిరోజులకే కిందటే మరో సీనియర్ జర్నలిస్ట్ ఫయాజ్ అహ్మద్‌ ను నానా బూతులు తిట్టిన ఆడియో టేప్ ఒకటి బయటపడింది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆదాల ప్రభాకరరెడ్డికి అనుకూలంగా కోటంరెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియలో వస్తున్న పోస్టులకు ఫయాజే కారణమని ఆరోపిస్తూ కోటంరెడ్డి ఆయన్ను రాయలేని భాషలో దూషించారు. ఇంటి అడ్రస్ చెబితే వచ్చి తంతానని కూడా ఆయన బెదిరించారు. అప్పట్లో ఆ ఆడియో టేప్ సంచలనంగా మారింది.

వీరినే కాకుండా మరికొందరు జర్నలిస్టులనూ కోటంరెడ్డి - ఆయన అనుచరులు డైరెక్టుగానే బెదిరిస్తున్నారని.. కొంతమంది ఎవరికీ చెప్పుకోలేక భయపడి ఆయనకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రాయడం మానేశారని నెల్లూరు జర్నలిస్టులు చెబుతున్నారు.

తాజాగా కోటంరెడ్డి చేతిలో దాడికి గురైన నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్. గతంలో ఆయన తేజ అనే పత్రికను నడిపించారు. ప్రస్తుతం జమీన్ రైతు పత్రిక నడిపిస్తున్నారు. ఆయనపై ఇలా దాడి చేయడాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఖండిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం మొదటి నంచి జర్నలిస్టుల పట్ల సానుకూలమే. వైఎస్ సాక్షి పెట్టాకనే జర్నలిస్టుల జీతాల్లో బాగా మార్పులు వచ్చాయి. జగన్ కూడా వీలైనంత వివాద రహితంగా పాలన సాగించాలని ప్రయత్నం చేస్తుంటే... అనుయాయులు నాయకుడిని ఫాలో అవుతున్నట్టు లేదు.