Begin typing your search above and press return to search.

హీటెక్కిన పేట పాలిటిక్స్...ఎమ్మెల్యే దూరమేనా...?

By:  Tupaki Desk   |   19 April 2022 4:30 PM GMT
హీటెక్కిన పేట పాలిటిక్స్...ఎమ్మెల్యే దూరమేనా...?
X
ఆయన సీనియర్ ఎమ్మెల్యే. అంతకు ముందు ప్రభుత్వ ఉద్యోగి కూడా వైఎస్సార్ భక్తుడు. అందుకే తన ఉద్యోగం ఇంకా ఉంటూండగానే రాజీనామా చేసి వైఎస్సార్ మాట మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. అలా 2009 ఎన్నికల్లో టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టి ఎమ్మెల్యే అయ్యారు. ఆయనే గొల్ల బాబూరావు. వైసీపీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాబూరావు తాను వైసీపీ పుట్టినప్పటి నుంచి ఉన్న సభ్యుడిని అని చెబుతున్నారు. తనకు మంత్రి పదవి రావాల్సిందే అన్నది ఆయన వాదన.

చాలా కాలంగా ఆయన మంత్రి పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నరు. ఆయన సీనియారిటీ, సిన్సియారిటీ. సామాజిక సమీకరణలు, విధేయత ఇవన్నీ చూసుకున్నపుడు కచ్చితంగా మంత్రి కుర్చీ ఆయనకే దక్కాలి. కానీ చిత్రంగా బూడి ముత్యాలనాయుడుకు, గుడివాడ అమరనాధ్ కి మంత్రి పదవులు లభించాయి. దాంతో బలమైన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన గొల్ల బాబూరావు ఇపుడు అధినాయకత్వం మీదనే తిరుగుబాటుకు రెడీ అయ్యారు.

చలో విజయవాడ పేరిట వెళ్ళి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డిని కలసి వచ్చినా బాబూరావులో ఆవేశం చల్లారలేదు. పైగా అక్కడ కచ్చితమైన భరోసా ఏదీ దక్కలేదు అని అంటున్నారు. దాంతో స్వరం మరింతగా పెంచి బాబూరావు వైసీపీ హై కమాండ్ తోనే తేల్చుకుంటాను అంటున్నారు. తనను అమాయకుడి కింద జమ కడతారా అని మండిపడుతున్నారు. నేను లక్షలాది మంది జనాల మధ్యకు వచ్చి కూడా హింసావాదిని అని చెబుతాను, నన్ను జైల్లో వేసుకోవచ్చు అని కూడా సవాల్ చేస్తున్నారు.

తాను వైఎస్సార్ వల్లనే జగన్ వైపు వచ్చాను తప్ప వేరే కారణం కాదని అంటున్నారు. అంటే తనకు వైఎస్సారే ముఖ్యమని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఒక విధంగా ఆయన ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇపుడు అదే అనకాపల్లి కొత్త జిల్లాలో హాట్ టాపిక్ గా ఉంది. బాబూరావు రూటు ఏంటి అన్నది కూడా చర్చగా ఉంది. ఆయన్ని జగన్ పిలిచి బుజ్జగిస్తారా లేదా అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది.

ఇప్పటికే చాలా మంది అసంతృప్తులను జగన్ నేరుగా పిలిపించుకుని బుజ్జగించి పంపారు. బాబూరావు విషయంలో అలా జరగకపోవడంతో ఆయన మండుతున్నారు అని అంటున్నారు. ఇక చూస్తే పాయకరావుపేటలో వైసీపీలో విభేదాలు ఉన్నాయి. బాబూరావుకు యాంటీగా ఈ మధ్యన ఒక బలమైన సామాజిక వర్గం రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసింది. దాంతో పాటు బాబూరావు మీద జనాల్లో కూడా అసంతృప్తి ఉందని కూడా అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కదు అని మరో మాట ప్రచారంలో ఉంది. ఇప్పటికే పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావుకు ఈసారి టికెట్ ఖాయమని చెబుతున్నారు. బాబూరావు హయాంలో పేటలో పార్టీ వర్గాలుగా విడిపోయిందని, దాంతో పాటు ఇపుడు ఆయన హైకమాండ్ కి వ్యతిరేకంగా రూట్ తీసుకుంటే అలాగే వదిలేస్తారు అన్న మాట కూడా ఉంది.

మొత్తానికి గొల్ల బాబూరావు విషయంలో అన్నీ ఆలోచించుకునే హై కమాండ్ ఏం జరిగినా జరగనీ అన్నట్లుగా ఉందని ప్రచారం సాగుతోంది. ఈ విషయాలు తెలియడం వల్లనే బాబూరావు కూడా బిగ్ సౌండ్ చేస్తున్నారు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ దక్కకపోతే టీడీపీ నుంచి పోటీ చేయాలి. అక్కడ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఉన్నారు. ఆమె పొలిట్ బ్యూరో మెంబర్ కూడా. ఆమెను కాదని టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. దాంతో బాబూరావుకు విపక్షం వైపు దారులు మూసుకుపోయాయనే అంటున్నారు. అయితే ఆయన కనుక ఏదైనా నామినేటెడ్ పదవి హామీతో చేరితే టీడీపీలో చేరవచ్చునని చెబుతున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఫైర్ అవుతున్నారు అంటే మంత్రి పదవి రానందుకు మాత్రమే కాదని, తనను పూర్తిగా అధినాయకత్వం పక్కన పెడుతోంది అన్న డౌట్లతోనే అంటున్నారు. మొత్తానికి బాబూరావు పేట రాజకీయం వైసీపీని హీటెక్కిస్తోంది. ఇది ఎలా సద్దుమణుగుతుందో తెలియదు కానీ అధికార పార్టీని పరేషాన్ చేసేలాగానే ఉంది అంటున్నారు.