Begin typing your search above and press return to search.

గిడ్డి ఈశ్వరి ఫిరాయింపు వైసీపీ మంచికేనా?

By:  Tupaki Desk   |   27 Nov 2017 7:32 AM GMT
గిడ్డి ఈశ్వరి ఫిరాయింపు వైసీపీ మంచికేనా?
X
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కొద్దిసేపటి కిందట టీడీపీలో చేరారు. వైసీపీ నుంచి గెలిచిన ఆమె ఆ పార్టీని వీడనున్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుండడం... ఆమె ఖండిస్తుండడం తెలిసిందే. అయితే... తాజాగా ఆమె ఇప్పటివరకు జరిగిన ప్రచారం నిజమని నిరూపిస్తూ టీడీపీలో చేరిపోయారు. నిన్నమొన్నటి వరకు తన నోటితో తిట్టిన చంద్రబాబు సమక్షంలోనే ఆమె పచ్చ కండువా కప్పుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఆయన వచ్చే ఎన్నికల్లో పాడేరు టిక్కెట్ ఈశ్వరి కేనని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా ఈశ్వరి పార్టీ మారడంతో అక్కడ వైసీపీ టిక్కెట్ పై ఏర్పడిన పోటీ తొలగినట్లేనని ఉత్తరాంధ్ర రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2009లో పాడేరు నుంచి గెలిచి వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన పసుపులేటి బాలరాజు వైసీపీలోకి రానున్నట్లు తెలుస్తోంది. అసలు ఆయన చేరిక ప్రయత్నాల కారణంగానే ఈశ్వరి తనకు సీటు దక్కదని తేలిపోయి పార్టీ మారిందని చెప్తున్నారు. బాలరాజుకు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చి, ఈశ్వరిని అరకు పార్లమెంటుకు పోటీ చేయాలని పార్టీ సూచించడంతో ఆమె టీడీపీలోకి వెళ్లినట్లు చెప్తున్నారు.

ఇదంతా ఎలా ఉన్నా పాడేరు నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిస్థితులు వైసీపీకే కలిసొస్తాయని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితేమీ గొప్పగా లేదు. ఈ ప్రాంతంలో 1994 - 1999లో తప్ప టీడీపీ ఇంకెన్నడూ గెలవలేదు. 2004లో ఇక్కడ బీఎస్పీ గెలిచింది. 2009లో కాంగ్రెస్ - 2014లో వైసీప గెలిచాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ ఈ సీటును మిత్రపక్షం బీజేపీకి ఇవ్వగా ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాలుగో స్థానంలో నిలిచారు.

మరోవైపు ఈ స్థానంలో సీపీఐకి మంచి క్యాడర్ ఉంది. సీపీఐ అభ్యర్థి గత రెండు ఎన్నికల్లోనూ రెండో స్థానంలో నిలవడం విశేషం. 2009 ఎన్నికల్లో అయితే సుమారు 600 ఓట్ల తేడాతో మాత్రం ఓడిపోయారు. 2014 ఎన్నికలు వచ్చేసరికి అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే, అప్పటి మంత్రి బాలరాజుకు కాంగ్రెస్ పార్టీకి తగిలిన విభజన దెబ్బ తగిలి ఓట్లు దారుణగా పడిపోయాయి. అది గిడ్డి ఈశ్వరికి కలిసొచ్చి ఆమె విజయం అందుకోగలిగారు.

అయితే... బాలరాజు విభజన తరువాత కాంగ్రెస్ కు పూర్తిగా దూరమై ఏ పార్టీలోనూ లేకపోవడం, ప్రస్తుతం విభజన బాధను జనం కొంతవరకు మర్చిపోవడంతో ఆయనకు మళ్లీ కలిసొస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో బాలరాజు కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నా తనకంటూ ఉన్న సొంత క్యాడర్ ను మాత్రం కనిపెట్టుకుంటూ ఉండడంతో ఆయన పూర్తిగా పట్టుకోల్పోలేదు. ఇప్పడు సొంత బలం, వైసీపీ, జగన్ ఇమేజ్ తో 2019 ఎన్నికల్లో మరోసారి గెలుపు సాధించాలని బాలరాజు గట్టి పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈశ్వరి టీడీపీలో చేరడంతో త్వరలోనే బాలరాజు వైసీపీలో చేరొచ్చని సమాచారం. అయితే... ఆయన చేరిక జగన్ పాదయాత్ర విశాఖ జిల్లాకు వచ్చినప్పుడు జరుగుతుందా లేదంటే అంతకంటే ముందే జరుగుతుందా అన్నది తెలియాలి.