Begin typing your search above and press return to search.

వ్య‌క్తుల‌పై ప‌ట్టు.. వ్య‌వ‌స్థ‌లకు చోటు లేదా? వైసీపీ నేతల దూకుడు!

By:  Tupaki Desk   |   25 Dec 2020 3:30 PM GMT
వ్య‌క్తుల‌పై ప‌ట్టు.. వ్య‌వ‌స్థ‌లకు చోటు లేదా?  వైసీపీ నేతల దూకుడు!
X
రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు.. దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం కామ‌నే! పైగా ప్ర‌త్య‌ర్థి వ‌ర్గానికి గ‌ట్టి ప‌ట్టున్న చోట‌.. తాము నిల‌దొక్కుకోవాలంటే.. దూకుడు ఉండాల్సిందే. అయితే.. ఇక్క‌డే చిన్న ఆలోచ‌న ఉండాలి. దూకుడు అంటే.. ఎలా ఉండాలి? ఎలా ముందుకు వెళ్లాలి? అనేది కీల‌క ప్ర‌శ్న‌. వ్య‌క్తుల‌పై ప‌ట్ట‌కోసం.. పాకులాడుతూ.. వ్య‌వ‌స్థ‌ల్లో చుల‌కన కావ‌డ‌మా.? లేక‌.. వ్య‌వ‌స్థ‌ల‌పై ప‌ట్టు సాధిస్తూనే వ్య‌క్తుల‌పై పైచేయి సాధించాలా? అనే విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. జ‌గ‌న్ కాకుండా 150 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది.

అయితే.. వీటిలో దాదాపు 50కి పైగా స్థానాలు టీడీపీ నేత‌ల‌కు గ‌ట్టి ప‌ట్టున్న కంచుకోట‌లు. అదేస‌మ‌యంలో ఇత‌ర పార్టీ నేత‌ల‌కు కూడా మంచి రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి చోట వైసీపీ నేత‌లు నెగ్గారంటే.. ఏదో భ‌యంక‌ర‌మైన మార్పుతోనో.. లేక త‌మ సొంత కండ‌బ‌లంతోనో కాదు.. ఖ‌చ్చితంగా ప్ర‌జ‌లు ఏదో ఎక్స్ ‌పెక్ట్ చేశారు! దీనిని ప‌ట్టుకుని.. ప్ర‌జ‌ల్లో సానుభూతిని పెంచుకుంటే.. స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు మ‌ళ్లీ మ‌ళ్లీ గెలుపు గుర్రాలు ఎక్కే అవ‌కాశం ఉంది. కానీ, వైసీపీ నాయ‌కులు ఆ కోణంలో ఎక్క‌డా ఆలోచించడం లేదు. సంయ‌మ‌నం పాటించ‌డ‌మూ లేదు.

చిన్న చిన్న‌కార‌ణాల‌కే రోడ్డెక్కుతున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌పై దాడుల‌కు దిగుతున్నారు. తాజాగా అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న దీనికి అద్దం ప‌డుతోంది. 40 ఏళ్లుగా జేసీ కుటుంబం ఇక్క‌డ విజ‌యం సాధించింది. అంటే ఎంత బ‌ల‌మైన కేడ‌ర్ ఉందో అర్ధ‌మ‌వుతుంది. అయితే.. అనూహ్యంగా ప్ర‌జ‌లు ఇక్కడ వైసీపీకి అవ‌కాశం ఇచ్చారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి విజ‌యం సాధించారు. ఇది నిజంగానే సంచ‌ల‌నం. మ‌రి దీనిని కొన‌సాగించి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ పెద్దారెడ్డో.. లేదా మ‌రో వైసీపీ నాయ‌కుడో గెలిస్తేనే.. నిజంగానే జేసీ కుటుంబం బ‌లం త‌గ్గింద‌ని భావించాలి.

కానీ, పెద్దారెడ్డి ఈ త‌ర‌హా ఆలోచ‌న చేయ‌డం లేదు. కేవ‌లం వ్య‌క్తుల‌పై పోరాటంతోనే వ్య‌వ‌స్థ‌పై ప‌ట్టుసాధి స్తాన‌ని ఆయ‌న అనుకుంటున్నార‌ని తెలుస్తోంది. త‌న‌పై వ‌చ్చిన చిన్న‌పాటి ప్ర‌చారాన్ని ఆయ‌న జీర్ణించు కోలేక పోయారు. ఏకంగా దీనిని ర‌చ్చ చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ ఇంటికి వెళ్లి మ‌రీ త‌గువు పెట్టుకుని యుద్ధం త‌ల‌పించారు. సోష‌ల్ మీడియాలో త‌న‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాయ‌కూడ‌ద‌నేది కేతిరెడ్డి భావ‌నే అయితే.. రాజ‌కీయాల‌కు ఆయ‌న సుత‌రామూ ప‌నికిరాడ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా.. వ్య‌క్తిగ‌త టార్గెట్ల కంటే.. వ్య‌వ‌స్థ‌ను టార్గెట్ చేసుకుని .. స‌ద‌రు సోస‌ల్ మీడియా పోస్టుల‌కు స‌మాధానం చెప్పి ఉంటే.. బాగుండేద‌ని సూచిస్తున్నారు.