Begin typing your search above and press return to search.

జనసేన జెండా ఎత్తుతున్న వైఎస్సార్ కుటుంబ ఆప్తుడు

By:  Tupaki Desk   |   14 Sept 2022 9:27 AM IST
జనసేన జెండా ఎత్తుతున్న వైఎస్సార్ కుటుంబ ఆప్తుడు
X
వైఎస్సార్ కి ఎందరో ఆప్తులు ఉన్నారు. ఆయనకు అత్యంత సన్నిహితులు ఉన్నారు. వారిలో జగన్ వెంట ఎంతమంది నడిచారు అంటే ఈ ప్రశ్నకు జవాబు ఎపుడూ ఇబ్బందికరంగా ఉంటుంది. తండ్రితో కలసి అడుగులు వేసినవారు చాలా మంది జగన్ కి దూరంగా ఉండిపోయారు అన్నది ఒక నిజం. అయితే అలా మిగిలిపోయిన వారిలో అగ్ర నాయకులే ఎక్కువ మంది ఉన్నారు. వారంతా కూడా ఏపీలో వైఎస్సార్ పాలన రావాలని ఈ రోజుకీ అంటారు.

అంటే వారి దృష్టిలో జగన్ వైఎస్సార్ కి కుమారుడు మాత్రమే తప్ప ఆయన ఆశయాలను పూర్తిగా నెరవేర్చేవారు కారనే భావన ఉండి ఉండాలి. ఇకపోతే జగన్ వెంట వైఎస్సార్ అనుచరులు చాలా మంది నడిచారు. వారంతా ద్వితీయ శ్రేణి నాయకులు. వారి వల్లనే వైసీపీ బలంగా ఉంది. ఈ రోజుకీ ఆ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ లో ఉంది అంటే ఒకనాటి కాంగ్రెస్ నాయకులు, వైఎస్సార్ ప్రేమికులు ఉండబట్టే అని అంటారు.

అలా చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో రాజోలు నియోజకవర్గంలో వైసీపీకి కరడు కట్టిన నాయకుడు ఒకరు ఉన్నారు. ఆయనే బొంతు రాజేశ్వరరావు. ఈ సీనియర్ నేత వైఎస్సార్ కుటుంబానికే అత్యంత ఆప్తుడు. వైఎస్సార్ సీఎం గా ఉన్న కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టును డిజైన్ చేసిన నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక ఆయన వైసీపీలో రెండు సార్లు టికెట్ తెచ్చుకుని పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2019లో ఆయనకు టికెట్ జగన్ ఇచ్చారు. దానికి కారణం వైఎస్ విజయమ్మ రికమండేషన్ కూడా ఉందని అంటారు. ఇక 2019లో బొంతు రాజేశ్వరరావు జనసేన అభ్యర్ధి రాపాక ప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. జనసేన ఏపీలో గెలిచిన ఒకే ఒక సీటు కూడా ఇదే.

ఆ తరువాత ఆయన వైసీపీ వైపు వెళ్లారు. దాంతో బొంతు రాజేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మొదటి నుంచి వైసీపీలో ఉన్న తనను పక్కన పెట్టడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. మరో వైపు చూస్తే రాజోలు లో జనసేనకు మంచి బలం ఉంది. క్యాడర్ ఫుల్ గా ఉంది. వారి బలంతోనే 2019 ఎన్నికల్లో రాపాక గెలిచారు. కానీ ఆయన ఫిరాయించడంతో జనసేన ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ ఆయన మీద మండిపోతున్నారు.

ఎట్టిపరిస్థితుల్లో ఆయన్ని ఓడించి తీరుతామని కూడా శపధం చేశారు. ఇపుడు వారి శపధానికి ఒక అర్ధం లభిస్తోంది. రెండు సార్లు ఓడి జనంలో సానుభూతి తెచ్చుకున్న బొంతు రాజేశ్వరరావు ఈ మధ్యనే హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ణి కలిశారు. అంటే ఆయన తొందరలోనే జనసేన తీర్ధం పుచ్చుకుంటారు అన్న మాట. సో వచ్చే ఎన్నికల్లో ఆయనే జనసేన క్యాండిడేట్.

ఈ నేపధ్యం నుంచి చూస్తే రాజోలు లో టైట్ ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటారు. ఆ ఫైట్ కూడా రాపాక బొంతుల మధ్యనే ఉంటుంది అంటున్నారు. ఇక్కడ టీడీపీ పెద్దగా పట్టు సాధించలేకపోతోంది. కాబట్టి డైరెక్ట్ ఫైట్ లో వైసీపీ జనసేనలో ఎవరు గెలుస్తారు అన్నది చూడాలి. జనసేనకు ఒక వైపు శపధం, సానుభూతి ఉన్నాయి కాబట్టి బొంతు రాజేశ్వరావు కే ఎడ్జ్ ఉంటుందని అంటున్నారు. మరి వైసీపీ టికెట్ సాధించి 2024లో కూడా రాపాక గెలవగలరా. వెయిట్ అండ్ సీ.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.