Begin typing your search above and press return to search.

గొర్రెల కాపారులపై వైసీపీ నాయకుడి దాడి?

By:  Tupaki Desk   |   28 March 2021 3:00 PM IST
గొర్రెల కాపారులపై వైసీపీ నాయకుడి దాడి?
X
కర్నూలు జిల్లాలో ఓ వైసీపీ నేత హల్ చల్ సృష్టించాడు. ఆదోని సమీపంలోని చిప్పగిరి సమీపంలో గొర్రెల కాపురులపై వైసీపీ నాయకుడు దాడి చేశాడని సమాచారం. దీన్ని నిరసిస్తూ సుమారు 500 మంది ధర్నాకు దిగారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

తాజాగా కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు వరసకు తమ్ముడు, వైసీపీ చిప్పగిరి మండల కన్వీనర్ అయినా నారాయణ శనివారం ఉదయం గుమ్మనూరు నుంచి ఆలూరుకు ఆరు వాహనాల్లో అనుచరులతో కలిసి బయలు దేరాడు. చిప్పగిరి-బంటనహాల్ గ్రామాల మధ్య గొర్రెలు అడ్డువచ్చాయి. వాటిని పక్కకు తప్పించమని గొర్రెల కాపరులు శివ, సుంకప్పపై నారాయణ అతడి అనుచరులు దాడి చేసినట్టు సమాచారం. దీంతో గొర్రెల కాపారులు తమ వారికి సమాచారం ఇచ్చారు.

బాధితులంతా కలిసి చిప్పగిరి సర్కిల్ లో గుమ్మనూరు నారాయణ కోసం ఎదురుచూశారు. మంత్రి జయరాంను కలిసి మధ్యాహ్నం 2 గంటలకు చిప్పగిరికి నారాయణ రాగానే బాధితుల బంధువులు అడ్డుకొని నిలదీశారు.

దీంతో ఆగ్రహానికి గురైన నారాయణ ‘నేను ఎవరో తెలుసా? మంత్రి తమ్ముడిని.. వైసీపీ మండల కన్వీనర్ వాహనం వస్తే అడ్డు తప్పుకోవాలి’ అంటూ ఫైర్ అయ్యారు. వారిపై దూషిస్తూ దాడి చేసినట్టు ప్రచారం సాగుతోంది. దీంతో చిప్పగిరి గ్రామస్థులు గుంతకల్లు-ఆలూరు సర్కిల్ లో ధర్నాకు దిగారు. రాత్రి 7 గంటల వరకు భైటాయించారు. నారాయణ, వారి అనుచరులను అరెస్ట్ చేసే వరకు వెళ్లేది లేదని గొర్రెల కాపరులు స్పష్టం చేశారు. గ్రామస్థులంతా వీరి ఆందోళనకు మద్దతుగా పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ, టీడీపీ నేత సర్ధిచెప్పారు. దీంతో స్థానికులు ఆందోళన విరమించారు.

గొర్రెల కాపరులపై దాడి చేసిన శ్రీధర్ తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.