Begin typing your search above and press return to search.

వైసీపీ ఒంటరిగానే బరిలోకి.. కాచుకోండి..

By:  Tupaki Desk   |   2 Jun 2018 9:44 AM GMT
వైసీపీ ఒంటరిగానే బరిలోకి.. కాచుకోండి..
X
రాష్ట్ర విభజనతో మోసపోయామని.. కట్టుబట్టులతో ఏపీని నడిబజారులో నిలబెట్టారని ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా నవనిర్మాణ దీక్ష సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 2 తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి సంబరాలు చేసుకుంటుండగా.. రాజధాని లేకుండా విడిపోయిన ఏపీ నవనిర్మాణ దీక్షతో ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజున ప్రజలు దీక్షలు చేయాలని బాబు పిలుపునిచ్చారు. మోడీ... ఏపీకి అన్యాయం చేశాడని చంద్రబాబు వాపోతున్నారు.

ఈ సందర్భంగా నెల్లూరులో వైసీపీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షకు విశేష స్పందన వచ్చింది. దీక్షకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ప్రధాని మోడీ.. ఏపీ సీఎం చంద్రబాబును మోసం చేయలేదని.. ఈ ఇద్దరు నేతలు కలిసి ఏపీ ప్రజలను మోసం చేశారని’ మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిపై బీజేపీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని.. ఈ విషయంలో ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. దీన్ని బట్టి టీడీపీ-బీజేపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని కౌంటర్ ఇచ్చారు. బీజేపీతో వైసీపీ కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని.. ఒంటరిగానే పోటీ చేస్తుందని అంటటి స్పష్టం చేశారు. ఇక సభలో పాల్గొన్న ఎంపీలు మేకపాటి - వైఎస్ అవినాశ్ రెడ్డి కూడా టీడీపీపై నిప్పులు చెరిగారు.

ఇలా సానుభూతి కోసం ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న దీక్షలకు వైసీపీ కౌంటర్లు ఆసక్తిగా మారాయి. నాలుగేళ్లు కలిసి ఉన్న చంద్రబాబు ఇప్పుడు బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేయడంపై వైసీపీ సెటైర్లు టీడీపీని ఇరుకున పెడుతున్నాయి. పైగా నెల్లూరు సభలో మరో విషయాన్ని వైసీపీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవ్వరితో కలిసి పోటీ చేయమని.. వైసీపీ ఒంటరిగా పోటీచేస్తుందని తెలిపి కార్యకర్తల్లో భరోసా కల్పించారు.