Begin typing your search above and press return to search.

పోలీస్ ఎంపీతో వైసీపీకి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదే...!

By:  Tupaki Desk   |   11 May 2022 2:27 AM GMT
పోలీస్ ఎంపీతో వైసీపీకి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదే...!
X
ఆయ‌న పోలీసు ఉద్యోగం నుంచి వ‌చ్చి ఎంపీ అయ్యారు. వైసీపీలో కీల‌క ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా కూడా ఎదిగారు. అయితే.. ఈ దూకుడు పార్టీపైనే చూపుతుండ‌డం ఇప్పుడు సొంత పార్టీకే ఇబ్బందిక‌రంగా మారింద‌నే ప‌రిస్థితి వ‌చ్చేలా చేసింది. ఆయ‌నే.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌. 2019కి ముందు సీఐగా ఉన్న మాధ‌వ్‌.. అప్ప‌టి ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజయం ద‌క్కించుకున్నారు. అప్ప‌టి నుంచి కూడా ఆయ‌న దూకుడుగా ఉన్నారు. ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఎంపీగా ఆయ‌న త‌న బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చ‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌వుతు న్నార‌నే వాద‌న కొన్నాళ్లుగా ఇటు పార్టీలోనూ.. అటు.. నియోజ‌క‌వ‌ర్గంలోనూ వినిపిస్తోంది.

నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. హిందూపురం, రాప్తాడు, పెనుకొండ‌, పుట్ట‌ప‌ర్తి, ధ‌ర్మ‌వ‌రం, క‌దిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ఎదుగుద‌ల‌కు ఎంపీగా ఎలాంటి చ‌ర్య‌లూ చేప‌ట్ట‌డం లేద‌ని.. ఇక్క‌డి కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు. క‌నీసం త‌మ‌కు ఆయ‌న ద‌ర్శ‌నం కూడా ల‌భించ‌డం లేద‌ని అంటున్నారు.

అంతేకాదు.. పార్టీ అధినేత ఒక‌వైపు.. అంద‌రూ ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని కోరుతున్నా.. ఈయ‌న మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌డం లేద‌ని.. ఢిల్లీలోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్నార‌ని.. ఇక్క‌డి వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

ఇక‌, ఎమ్మెల్యేల‌కు, ఎంపీల‌కు మ‌ధ్య కొన్ని చోట్ల వివాదాలు ఉన్న‌ట్టుగానే.. ఇక్క‌డ కూడా ఎంపీకి వివాదాలు ఉన్నాయి.అ యితే.. ఇవి ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న వారికి సీటు ఇప్పించుకోవాల‌ని.. భావిస్తున్న ఆయ‌న గ్రూపు రాజ‌కీయాలు చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

అదేవిధంగా ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నీసం .. ప‌ర్య‌టించ‌డ‌మే లేద‌ని చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యేల‌కు.. ఎంపీకి మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఏదైనా కార్య‌క్ర‌మం ఉంటే వ‌చ్చి వెళ్తున్నారు త‌ప్ప‌.. త‌న‌కంటూ.. ప్ర‌త్యేక అజెండా ఏర్పాటు చేసుకుని మాత్రం పార్టీనిడెవ‌ల‌ప్ చేసుకునేందుకు ఆయ‌న ఏమాత్రం ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌ని చెబుతున్నారు. దీనివ‌ల్ల పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంద‌ని అంటున్నారు. మ‌రి దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.