Begin typing your search above and press return to search.

పంచాయితీ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్ల అడ్డాల్లో వైసీపీ పాగా

By:  Tupaki Desk   |   14 Feb 2021 1:00 PM IST
పంచాయితీ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్ల అడ్డాల్లో వైసీపీ పాగా
X
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పంచాయితీ ఎన్నికల్లో రెండో విడత ముగిసింది. ఇప్పటికే మొదటి విడతలో అధికార వైసీపీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున ఎన్నికల్లో గెలుపొందారు. ఇదే ఊపును రెండో దశలోనూ కొనసాగించారని చెప్పాలి. తొలి విడతలో వైసీపీకి చెందిన అభ్యర్థులు పెద్ద ఎత్తున ఎన్నికల్లో విజయం సాధించటం ఒక ఎత్తు అయితే.. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖుల ఇలాకాల్లోనూ ఫ్యాన్ సానుభూతిపరులైన అభ్యర్థులు విజయం సాధించారు.

తాజా పంచాయితీ ఎన్నికల ఫలితాలు పలువురు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖుల కంచుకోటల్ని బద్ధలు కొట్టిన పరిస్థితి. టీడీపీకి చెందిన పలువురు ప్రముఖులకు పంచాయితీ ఎన్నికలు షాకింగ్ గా మారాయి. ఉదాహరణకు విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్వగ్రామం చినమేరంగిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైన అల్లు రమణమ్మ 122 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితి ఒక్క విజయనగరం జిల్లాకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అలాంటి పరిస్థితి ఉందన్న మాట వినిపిస్తోంది.

తాజా పంచాయితీ ఎన్నికలు తెలుగు తమ్ముళ్ల అడ్డాలు.. వైసీపీ అభిమానులు పాగా వేసినట్లుగా చెప్పక తప్పదు. తాము ఎంతగా ప్రయత్నించినా కూడా వైసీపీ దూకుడును తట్టుకోలేని పరిస్థితి నెలకొందన్న మాట బలంగా వినిపిస్తోంది. అలాంటి వాటి విషయానికి వస్తే..

విజయనగరం జిల్లాలోని ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి స్వగ్రామం కవిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ అభిమాని 408 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. కర్నూలు జిల్లాలో ఇల్లూరి కొత్తపేటలో వైఎస్సార్‌సీపీ అభిమాని గోరంట్ల వెంకటరమణ గెలిచి టీడీపీ కంచుకోటను బద్దలుగొట్టారు. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్‌ నియోజకవర్గం రాప్తాడు 58 పంచాయతీలుండగా.. వైఎస్సార్‌సీపీ అభిమానులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు.

ఇదే జిల్లాకు చెందిన కళ్యాణదుర్గం టీడీపీ ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు స్వగ్రామం అంకంపల్లిలో వైఎస్సార్‌సీపీ అభిమాని రుద్ర విజయం సాధించారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సొంత పంచాయతీ సంగాలలో వైఎస్సార్‌సీపీ అభిమాని విజయం సాధించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో 130 పంచాయతీలకు గాను 117 చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయదుందుభి మోగించారు. ఇలా పలు జిల్లాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది.