Begin typing your search above and press return to search.

ప్రభుత్వం వద్దంటోంది, నిమ్మగడ్డ కావాలంటున్నారు

By:  Tupaki Desk   |   22 Oct 2020 4:20 PM IST
ప్రభుత్వం వద్దంటోంది, నిమ్మగడ్డ కావాలంటున్నారు
X
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరి చూస్తుంటే ప్రభుత్వంతో ఢీ కొనేందుకు రెడీ అవుతున్నట్లు అనుమానంగా ఉంది. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు వేసిన కేసును చూసిన తర్వాత ఈ అనుమానం బలపడుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వాన్ని విడుదల చేయించాలంటూ ఆదేశాలివ్వాలని నిమ్మగడ్డ కోర్టులో వేసిన కేసుపై విచారణ జరిగింది. ఇప్పటికప్పుడు ఎన్నికల కమీషన్ కు నిధులెందుకు ? ఎందుకంటే అర్ధాంతరంగా వాయిదాపడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించటానికే అని నిమ్మగడ్డ తరపు లాయర్ కోర్టులో వాదించారు.

ఒక్కసారి చరిత్రలోకి చూస్తే మొన్నటి మార్చిలో జరుగుతున్న స్ధానిక సంస్ధల ఎన్నికలను కరోనా వైరస్ కారణంగా చూపించి నిమ్మగడ్డ ఏకపక్షంగా వాయిదా వేశారు. నిమ్మగడ్డ వైఖరి నచ్చని ప్రభుత్వం ఆర్డినెన్సు ద్వారా నిమ్మగడ్డను ఎలక్షన్ కమీషనర్ గా తీసేసింది. తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళటం మళ్ళీ ఆర్డర్ తెచ్చుకుని జాయిన్ అవ్వటం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి కూడా బాగా పెరిగిపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే వాయిదాపడిన ఎన్నికలను జరిపించాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ మొదలుపెట్టిన కోర్టు ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం ఏమో కరోనా వల్ల ఎన్నికలు జరపలేం అని పేర్కొంది. చెప్పాల్సింది మీరు కాదు ఈసీ అని ఎన్నికల కమీషన్ కు నోటీసులు ఇచ్చినపుడు తాము ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్నట్లు నిమ్మగడ్డ చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన రూ. 40 లక్షలను ఇవ్వాలని అడిగినా ప్రభుత్వం ఇవ్వటం లేదంటూ ఆరోపించారు. అయితే నిమ్మగడ్డ అడిగిన రూ. 40 లక్షల్లో ఇప్పటికే రూ. 39.69 లక్షలు విడుదల చేసినట్లు ప్రభుత్వం చెప్పింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా వైరస్ లేనపుడేమో దాన్ని బూచిగా చూపించి ఎన్నికలను వాయిదా వేశారు. తాజాగా రోజుకు వేలాది కేసులు నమోదవుతున్న విషయం తెలిసికూడా ఇపుడు ఎన్నికలను జరపాలని అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహించే పరిస్ధితి లేదని ప్రభుత్వం కోర్టులో చెప్పిన తర్వాత కూడా నిమ్మగడ్డ ఎన్నికలను నిర్వహించాల్సిందే అంటున్నారు.

నిజానికి నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేసిన సమయంలో రాష్ట్రం మొత్తం మీద నెల్లూరు జిల్లాలో కేవలం ఒకే ఒక్క కేసు రిజిస్టర్ అయ్యుంది. అయితే, అప్పట్లో కరోనా భయం మాత్రం తీవ్రంగా ఉండేది. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకునే తాను ఎన్నికలను వాయిదా వేసినట్లు నిమ్మగడ్డ కోర్టులో వాదన వినిపించారు.