Begin typing your search above and press return to search.

ఒంటరి మహిళలకు జగన్ ప్రభుత్వం షాక్!

By:  Tupaki Desk   |   18 Jun 2022 8:30 AM GMT
ఒంటరి మహిళలకు జగన్ ప్రభుత్వం షాక్!
X
ఆంధ్రప్రదేశ్ లో ఒంటరి మహిళలకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వైఎస్సార్ పింఛన్ కానుక పథకం కింద ఒంటరి మహిళలకు, భర్త నుంచి విడిపోయిన మహిళలకు, వివాహం కాని మహిళలకు ఇచ్చే పింఛన్ అర్హత వయసును ప్రస్తుతమున్న 35 ఏళ్ల నుంచి ఏకంగా 50 ఏళ్లకు పెంచింది. ఇప్పటివరకు 35 ఏళ్లు దాటితే వీరికి పింఛన్ ఇస్తుండగా ఇక నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి 50 ఏళ్లు దాటితేనే పింఛన్ ఇవ్వనుంది.

అందులోనూ భర్తను వదిలేసి లేదా భర్త వదిలేసి కనీసం సంవత్సరం గడిచాకే పింఛనుకు అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కార్యదర్శి గోపాలకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే పెళ్లికాని మహిళల పింఛను అర్హత వయసును కూడా జగన్ ప్రభుత్వం పెంచింది. ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లో అవివాహిత మహిళలకు 30 ఏళ్లు నిండితే పింఛను ఇస్తున్నారు. ఇకపై 50 ఏళ్లు దాటితేనే పింఛను అందివ్వనుంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 35 ఏళ్లు నిండినవారికి పింఛను ఇస్తుండగా ఇక నుంచి 50 ఏళ్లు దాటితేనే పింఛను ఇస్తారు.

అంతేకాకుండా ఆ మహిళకు కుటుంబ సభ్యుల నుంచి కూడా సాయం అందకపోతేనే అనే నిబంధన విధించింది. అంతేకాకుండా ఇంకా పెళ్లి కాలేదనే ధ్రువీకరణ పత్రాన్ని స్థానిక తహసీల్దార్ వద్ద తీసుకుని సమర్పించాలని వెల్లడించింది.

అయితే ఇప్పటిదాకా ఈ పింఛను పొందుతున్నవారికి ఈ నిబంధనలు వర్తించవని.. ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకుంటారో.. వారికి మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని జగన్ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 1,88,062 మంది ఒంటరి మహిళలు పింఛను తీసుకుంటున్నారు. వీరికి నెలకు రూ.2500 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకొకసారి పింఛను మంజూరు విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జూలై 1న కొత్త పింఛన్లను అందిస్తామని తెలిపింది.

మరోవైపు ఇప్పటికే చాలామంది ఒంటరి మహిళలు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారు. ఇప్పుడు వీరందరికీ కొత్త నిబంధనలు వర్తింపజేస్తే వారంతా పింఛన్ అవకాశాన్ని కోల్పోతారు. జగన్ ప్రభుత్వ నిర్ణయంపై మహిళా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.