Begin typing your search above and press return to search.

బీసీ ప్రముఖులను మర్చిపోయిన వైసీపీ!?

By:  Tupaki Desk   |   15 Dec 2020 12:30 PM GMT
బీసీ ప్రముఖులను మర్చిపోయిన వైసీపీ!?
X
ఇపుడీ అంశంపైన అధికార వైసీపీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఈమధ్యే 56 బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లతో పాటు పాలకవర్గాలను నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటికి రెండుసార్లు వాయిదాపడిన ప్రమాణస్వీకారోత్సవాన్ని తాజాగా ముహూర్తం పెట్టుకున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈనెల 17వ తేదీన ప్రమాణస్వీకారోత్స కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు.

ఈ కార్యక్రమం కోసం ఇన్విటేషన్ కార్డులను కూడా ముద్రించి ప్రముఖులందరికీ పంపేశారు. కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుతూ మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు చివరకు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించారు. కార్యక్రమానికి హాజరయ్యేవారిలో ప్రజాప్రతినిధుల పేర్లను డీటైల్డ్ గా ముద్రించారు. అయితే నాలుగు పేజీల ఈ ఇన్విటేషన్ కార్డులో ఎంత వెతికినా వైసీపీలోని బీసీ ప్రముఖ నేతల పేర్లు మాత్రం కనబడలేదు.

పార్టీ తరపున బీసీ అధ్యయన కమిటి ఛైర్మన్, ఎంఎల్సీ జంగా కృష్ణమూర్తి, రాజ్యసభ ఎంపిలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్లు మాత్రం ఇన్విటేషన్ కార్డులో ఎక్కడా కనబడలేదు. ఇపుడు పై ముగ్గురు నేతలు బీసీ సామాజికవర్గంలో ప్రముఖులుగా ఉన్నారు. పైగా వీరు ముగ్గురూ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులే. ఇటువంటి కీలకమైన నేతలను బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, పాలకవర్గాల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎలా మరచిపోయారో పార్టీలో ఎవరికీ అర్ధం కావటం లేదు.

నిజానికి ఇన్విటేషన్ కార్డుల్లో ప్రభుత్వం తరపున కానీ, పార్టీ తరపునో లేదా బీసీ సంఘాల తరపున ఆహ్వానిస్తున్నట్లు కానీ ఎక్కడా లేదు. నిర్వాహకుల పేర్లు కూడా ఎక్కడా లేదు. అయినా సరే అధికార, ప్రతిపక్షాల్లోని అనేకమంది ప్రముఖులను పిలిచిన నిర్వాహకులు ముగ్గురు బీసీ ప్రముఖులను వదిలేయటంపై పార్టీలో చర్చ మొదలైంది.