Begin typing your search above and press return to search.

దేవుడికి వేసే పూలదండల్లోనూ వైసీపీ రంగులు కనిపిస్తున్నాయా?

By:  Tupaki Desk   |   30 May 2021 8:00 PM IST
దేవుడికి వేసే పూలదండల్లోనూ వైసీపీ రంగులు కనిపిస్తున్నాయా?
X
పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటారు. ఈ సామెతకు తగ్గట్లే తాజా ఉదంతాన్ని చెప్పాలి. పసుపు రంగు ఎక్కడ కనిపిస్తే.. అదంతా తెలుగు దేశం పార్టీ రంగు అనటం ఎంత దరిద్రంగా ఉంటుందో.. నీలం.. ఆకుపచ్చ రంగుల కాంబినేషన్ లో ఏం కనిపించినా వైసీపీ ఖాతాలో వేయటం కూడా అంతే దరిద్రంగా ఉంటుంది. లోపాన్ని ఎత్తి చూపేటప్పుడు.. ఎవరూ కాదనలేనట్లుగా ఉండాలే కానీ.. మనసుకు అనిపించింది.. లోకమంతా అనుకోవాలన్న తీరు ఏ మాత్రం మంచిది కాదు.

తాజాగా ద్వారకా తిరుమల ఆలయంలోని స్వామివారికి గర్భాలయానికి అలంకరణ కోసం ఏర్పాటు చేసిన పూలదండలకు చుట్టిన మెరుగు పేపర్లలో వైసీపీ జెండా రంగుల్ని చూడటాన్ని ఏమనాలి? తాజాగా కొందరు ఈ పూలమాలలకు ఉన్న బ్లూ.. గ్రీన్ ప్లాస్టిక్ పూలను వినియోగించటాన్ని వివాదాస్పదంగా మార్చటానికి పడుతున్న ప్రయత్నాల్ని చూస్తుంటే నవ్వాలో.. ఏడవాలో అర్థం కాని పరిస్థితి.

ద్వారకా తిరుమలలోని స్వామి వారి బ్రహ్మోత్సవాల్ని ఈ నెల 22 నుంచి 29 వరకు నిర్వహించారు. శనివారం బ్రహ్మోత్సవాల చివరి రోజు. ఈ సందర్భంగా గర్భాలయంలో పూలు.. పళ్లతో అలంకరణ చేశారు. ఈ అలంకరణలో వైసీపీ జెండాను పోలి ఉన్న ప్లాస్టిక్ పూల దండల్ని వాడారన్న ఆరోపణను తెర మీదకు తీసుకొచ్చి ఆగమాగం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే అలానే చేయాలన్నది ఆలయ పూజారులు.. అధికారుల లక్ష్యం అనుకుందాం.గర్భాలయం వరకు ఎందుకు ఆగాలి? స్వామి వారికి పూదండల్లోనూ ఆ రంగులు ఉండేలా చేసి ఉండొచ్చు కదా?

ఈ ఉదంతంపై వైరల్ అవుతున్న ఫోటోలో.. వైసీపీ జెండాను పోలి ఉండే ప్లాస్టిక్ దండల్ని సున్నాలు చుట్టి చూపిస్తున్న వారు.. ఆలయం లోపల.. స్వామి వారికి ఏర్పాటు చేసిన దండల్ని చూసినప్పుడు వేరే రంగుల్లో కనిపిస్తాయి. నిజంగానే వైసీపీ జెండా రంగుల్ని వాడాలన్న అత్యుత్సాహమే ఉండి ఉంటే.. గర్భాలయం బయటే ఎందుకు? లోపల కూడా అలాంటివే ఏర్పాటు చేస్తే అడిగే వాడు ఎవరుంటారు? ఒకవేళ అడుగుతారని అనుకుంటే.. ముందు ఏర్పాటు చేస్తే అడిగినట్లే.. లోపల ఏర్పాటు చేసినా అడుగుతారు.

తెగించినోడికి.. అన్న సామెతకు తగ్గట్లుగా వ్యవహరించొచ్చు కదా? అలాంటిదేమీ లేకున్నా.. ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.రంధ్రాన్వేషణ మంచిదే.. కానీ అందులో లాజిక్ ఉండాలి? ప్రజలు అవును కదా? అనుకునేలా ఉండాలి. అంతే తప్పించి.. మన కళ్లకు కనిపించింది.. మన మనసుకు అనిపించింది లోకమంతా అనుకోవాలనుకోవటం సరికాదు. ఈ విషయాన్ని అర్థం లేని ప్రచారం చేసే వారికి ఎప్పటికి అర్థమవుతుందో?