Begin typing your search above and press return to search.

అవును వైసీపీ,టీడీపీ ఒక్కటయ్యాయి..! ఎక్కడంటే..?

By:  Tupaki Desk   |   15 Dec 2021 11:37 AM GMT
అవును  వైసీపీ,టీడీపీ ఒక్కటయ్యాయి..! ఎక్కడంటే..?
X
ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలో చూస్తే యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. నువ్వా.. నేనా.. అన్నట్లు ఇరు పార్టీల నాయకులు పోటీ పడి ఆరోపణలు చేసుకుంటారు. అవసరమైతే బూతులు కూడా తిట్టుకుంటారు. పిల్లి ఎలుకలా.. ఎప్పుడూ పొట్లాడుకునే వైసీపీ, టీడీపీలు ఒక్కటయ్యాయి..! ఇరు పార్టీల నేతలు ఎదురెదురుగా కనిపిస్తే ఆక్రోశాలు వెళ్లగక్కే వారు ఇప్పుడు చేయి చేయి పట్టుకొని నినదిస్తున్నారు. సమస్యలపై పోరాడుతున్నారు. తమకు కావాల్సిన దాని కోసం కేంద్రంపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఇరు పార్టీల నాయకులు కలిసి ఒకే వేదికపైకి రావడానికి కారణం బీసీ కుల గణన కావడం అందరినీ ఆసక్తి రేపింది.

ఢిల్లీ వేదికగా ఈ రెండు పార్టీల నాయకులు కేంద్రపై నిరసన తెలుపుతున్నారు. బీసీ ల కులగణన చేయాలంటూ నినదిస్తున్నారు. రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి చెందిన నాయకులు కలిసి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్న మూడురోజుల కార్యక్రమంలో వీరు పాల్గొని బీసీ డిమాండ్లు నెరవేర్చాలని అన్నారు. రెండు పార్టీలకు చెందిన ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆందోళన చేశారు.

కేంద్రపై ఒకరి కంటే ఒకరు సాన్నిహిత్యంగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేవారు ఇలా ఇరు పార్టీల నేతలు ఒక్కటి కావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో.. ప్రాజెక్టుల విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాకుండా తప్ప తమదంటే తమది కాదని తప్పించుకు తిరిగారు. ఇక రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితికి వైసీపీనే కారణమని టీడీపీ ఆరోపిస్తుంటే.. అంతకుముందు ప్రభుత్వమే కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోడానికే సమయం మించిపోతుంది.

కానీ బీజీ కుల గణన ఆందోళన కార్యక్రమంలో రెండు పార్టీలు కలిసి పాల్గొనడం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీలో ఎక్కువగా బీసీ ఓట్లున్నాయి. వారు చేస్తున్న ఆందోళనలో పాల్గొనకపోతే మొదటికే మోసం అవుతుంది. అందువల్ల వచ్చే ఎన్నికల్లో బీసీల నుంచి ప్రయోజనం పొందేందుకు ఒకరికంటే మరొకరు పోటీ పడి వారి ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు. అంతేకాకుండా కేంద్రం తీరును తప్పుపడుతూ నినాదాలు చేస్తున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాల్లో ఇవే నినాదాలు చేయొచ్చుగా అని కొందరు అంటున్నారు.

బీసీలను ఆకర్షించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పావులుకదుపుతున్నారు. బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను నియమించారు. బీసీలకు ప్రత్యేకంగా పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆకర్షిస్తున్నారు. అయితే అంతకుముందు కూడా తాము బీసీలకు ఎంతో చేశామని టీడీపీ చెబుతోంది మరోసారి అధికారంలోకి వస్తే ఇంకా చేస్తామంటోంది. ఎవరివాదనలు ఎలా ఉన్నా టామ్ అండ్ జెర్రీలా పోట్లాడే వైసీపీ, టీడీపీ నాయకులు ఒకే వేదికపై కనిపించడం ఆశ్చర్యమేసిందని అంటున్నారు.