Begin typing your search above and press return to search.

భత్కల్ జైలు గోడలు బద్దలుకొట్టి వచ్చేస్తాడట

By:  Tupaki Desk   |   4 July 2015 9:10 AM GMT
భత్కల్ జైలు గోడలు బద్దలుకొట్టి వచ్చేస్తాడట
X
కరడుగట్టిన తీవ్రవాది, ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ సభ్యుడు, దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల నిందితుడు యాసిన్ భత్కల్ చర్లపల్లి జైలు నుంచే తన భార్యకు ఫోన్ చేసిన విషయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. భార్యకు ఫోన్ చేయడం ఒకెత్తయితే... వారిద్దరి సంభాషణల్లో వచ్చిన అంశాలు మరింత సంచలనం కలిగిస్తున్నాయి. ఆయన చర్లపల్లి జైలు నుంచి తప్పించుకునేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. జైలు గోడలు బద్దలుకొట్టి మరీ వచ్చేస్తానని ఆయన భార్యతో చెప్పినట్లు అధికారులు గుర్తించారు.

యాసిన్ భత్కల్ ఫోన్స్ కాల్స్‌ను రికార్డు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రికార్డు చేసింది. ఈ సమాచారాన్ని కేంద్ర, రాష్ట్రాల నిఘా వర్గాలకు ఎన్ఐఏ సమాచారమిచ్చింది. యాసిన్ భత్కల్ తన భార్య జుహీదాతో ఒకే రోజు పదిసార్లు ఫోన్ చేసి మాట్లాడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. జైల్లో ఖైదీలు మాట్లాడుకునేందుకు అధికారులు ఏర్పాటు చేసిన ఫోన్లో నుంచే యాసిన్ ఫోన్ చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే మనం కలుసుకుంటామని భార్య జుహీదాతో యాసిన్ చెప్పినట్లు సమాచారం. అంతేగాక, త్వరలోనే జైలు గోడలు బద్దలు కొట్టుకుని వస్తానని యాసిన్ చెప్పినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తన స్నేహితుల ద్వారా బయటికి వస్తానని చెప్పినట్లు తెలిసింది.

వీటన్నిటికీ మించి అధికారులను ఆందోళన కలిగిస్తున్న అంశమేంటంటే... భత్కల్ తన భార్యతో మాట్లాడుతూ డమాస్కస్ నుంచి సాయం అందుతుంది... జైలు నుంచి వారే విడిపిస్తారు అని చెప్పడంతో ఇంటిలిజెన్సు వర్గాలు అప్రమత్తమయ్యాయి. భత్కల్ చెప్పిన డమాస్కస్ సిరియా దేశం రాజధాని... సిరియా అంటే ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ప్రధాన కేంద్రం. భత్కల్ మాటలు ప్రకారం ఆయనకు ఆ సంస్థతోనూ సంబంధాలున్నాయని... వారి సహకారంతో చర్లపల్లి జైలు నుంచి బయటపడడానికి స్కెచ్ గీశాడని అర్థమవుతోంది. డమాస్కస్ సే లోగ్ మదత్ కర్ రహే... మై జల్దీ రిహా హో జావూంగా అని భత్కల్ తన భార్యతో అన్న మాటలు ఇప్పుడు నిఘావర్గాల రోమాలు నిక్కబొడిచేలా చేశాయి. హైదరాబాద్ ఇప్పుడు మళ్లీ నిఘా నీడలోకి వచ్చేస్తోంది.