Begin typing your search above and press return to search.

అప్ప‌టి బీజేపీ కాదు..బీజేపీ సీనియ‌ర్ ఆవేద‌న‌

By:  Tupaki Desk   |   12 Jan 2018 6:47 AM GMT
అప్ప‌టి బీజేపీ కాదు..బీజేపీ సీనియ‌ర్ ఆవేద‌న‌
X
బీజేపీ సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా మ‌రోమారు త‌మ పార్టీ తీరుపై విరుచుకుప‌డ్డారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - బీజ‌పీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఈ ఇద్ద‌రు నేత‌ల ఏలుబ‌డిలో బీజేపీ స్వ‌రూప‌మే మారిపోయింద‌ని మండిప‌డ్డారు. మధ్యప్రదేశ్‌ లోని జబల్పూర్‌ లో ఆయన విలేకరులతో మాట్లాడారు.`దాదాపు 13 నెలల క్రితం ప్రధాన మంత్రి మోడీని కలిసేందుకు అపాయింట్‌ మెంట్ కోరాను. కానీ ఇంతవరకూ దానికి సమాధానం రాలేదు. అందుకే ఇక నుంచి ఎవరినీ కలవకూడదని - చెప్పాలనుకున్న విషయాలను ప్రజలకు నేరుగా వివరించాలని నిర్ణయించుకున్నాను' అని తేల్చిచెప్పారు

ఈ సంద‌ర్భంగా బీజేపీ విధానాల‌ను మాజీ ఆర్థిక‌మంత్రి అయిన సిన్హా నిశితంగా విమ‌ర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన విధానాలన్నింటినీ అధికారంలోకి వచ్చాక బీజేపీ అమలుచేస్తున్నదని య‌శ్వంత్ సిన్హా ఆరోపించారు. 'దేశంలో రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌ లో కూడా రైతుల పరిస్థితి ఏమీ బాగోలేదు' అన్నారు. 'ఇది అప్పటి బీజేపీ కాదు.. అటల్‌ బిహారీ వాజ్‌ పేయి - అద్వానీ హయాంలో పార్టీ పరిస్థితి ఎంతో బాగుండేది. కింది స్థాయి కార్యకర్త సైతం ఢిల్లీకి వెళితే పార్టీ అధ్యక్షుడితో ఎలాంటి అపాయింట్‌ మెంట్‌ లేకుండానే కలవగలిగేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు' అన్నారు. 'ఇప్పుడు సీనియర్‌ - ముఖ్య నేతలకు కూడా పార్టీ అధ్యక్షుడితో అపాయింట్‌ మెంట్‌ దొరకడంలేదు. వివిధ అంశాలపై ప్రధాన మంత్రితో చర్చించేందుకు 13 నెలల క్రితం ఆయన అపాయింట్‌ మెంట్‌ కోరాను. కానీ, ఇంతవరకూ లభించలేదు. అందుకే ఇక బహిరంగంగానే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను' అన్నారు.

ఈ సంద‌ర్భంగా ప్రధానమంత్రి - అమిత్‌ షా తదితరులున్న ఒక ఫోటోను చూపిస్తూ.. 'ఈ ఫొటోలో రాజ్‌ నాథ్‌ సింగ్‌ - అనంత్‌ కుమార్‌ - సుష్మా స్వరాజ్‌ ఇతరులందరూ కనిపిస్తున్నారు. కానీ, అద్వానీ కనీసం వెనుక వరుసలో కూడా లేరు. ముఖ్యమైన నేత నుంచి ఆయన ఇప్పుడు సాధారణ కార్యకర్త అయిపోయారు' అని యశ్వంత్‌ సిన్హా విమర్శించారు. గత కొంతకాలంగా బీజేపీ పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, న‌ర్సింగ్‌ పూర్‌ జిల్లా గదర్వార్‌ లో శుక్రవారం జరిగే రైతు ఆందోళనా కార్యక్రమంలో యశ్వంత్‌ సిన్హా పాల్గొన‌నున్నారు.