Begin typing your search above and press return to search.

మోడీ బ్యాచ్‌ కు మ‌రోసారి షాకిచ్చిన య‌శ్వంత్‌

By:  Tupaki Desk   |   30 Sep 2017 6:34 AM GMT
మోడీ బ్యాచ్‌ కు మ‌రోసారి షాకిచ్చిన య‌శ్వంత్‌
X
సీనియ‌ర్ బీజేపీ నేత‌.. ఆర్థిక నిపుణుడిగా.. సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిగా సుప‌రిచితుడు య‌శ్వంత్ సిన్హా. సౌమ్యుడిగా పేరున్న ఆయ‌న మాజీ ప్ర‌ధాని వాజ్ పేయ్ హ‌యాంలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. మోడీ స‌ర్కారులో ఎలాంటి పాత్ర పోషించ‌ని ఆయ‌న్ను ఒక విధంగా చెప్పాలంటే అస్స‌లు ప‌ట్టించుకోలేద‌నే చెప్పాలి. ఇటీవ‌ల కాలంలో ప్ర‌ధాని మోడీ తీసుకున్న నిర్ణ‌యాల‌పై ఆయ‌న రాసిన వ్యాసం ఒక‌టి సంచ‌ల‌నంగా మార‌ట‌మేకాదు.. బీజేపీ నేత‌లు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేలా చేసింది. ప్ర‌ధాని మోడీ.. ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ ఇద్ద‌రూ క‌లిసి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స‌ర్వ‌నాశ‌నం చేశారంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ ఆయ‌నతో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ చేసింది.

ఈ సంద‌ర్భంగా మ‌రింత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు య‌శ్వంత్‌. ప్ర‌ధాని మోడీ అండ్ కో మీద త‌న పోరాటం కొన‌సాగుతుంద‌ని చెప్పిన య‌శ్వంత్‌.. త‌న‌కు పార్టీలో మాట్లాడే అవ‌కాశం లేదు కాబ‌ట్టే తాను వ్యాసం రాయాల్సి వ‌చ్చింద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. పార్టీలో మాట్లాడే వేదిక లేనందునే మీడియా ద్వారా తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పిన‌ట్లుగా చెప్పారు. పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గంలో ఇలాంటి అంశాల మీద చ‌ర్చించ‌టానికి అనుమ‌తించ‌ర‌ని.. ఒక‌వేళ అనుమ‌తించినా ప‌ది లేదంటే 20 నిమిషాల‌కు మించి చ‌ర్చిస్తార‌ని.. దానివ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్నారు.

ఇక‌.. ప్ర‌ధాని మోడీని తాను గ‌తంలో క‌ల‌వ‌టానికి ప్ర‌య‌త్నించాన‌ని.. కానీ ఆయ‌న‌కు తానంటే ఎందుకు ఇష్టం లేద‌ని.. ఆయ‌న ద్వారాలు మూసేశార‌న్నారు. జైట్లీకి స‌ల‌హాలు ఇవ్వ‌లేద‌ని.. ఆయ‌న త‌న‌నెప్పుడు గుర్తించ‌లేద‌న్నారు. త‌న‌ను 80 ఏళ్ల నిరుద్యోగిగా అభివ‌ర్ణించిన జైట్లీపై మండిప‌డ్డారు య‌శ్వంత్‌.

జైట్లీ వ్యాఖ్య‌ల మీద రియాక్ట్ అయితే త‌న గౌర‌వాన్ని తాను త‌గ్గించుకున్న‌ట్లు అవుతుంద‌న్న ఆయ‌న‌.. త‌న‌కు మ‌రో 12 ఏళ్ల స‌ర్వీసు ఉండ‌గానే రాజీనామా చేసి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన విష‌యాన్ని గుర్తు చేశారు. వీపీ సింగ్ స‌ర్కారులో త‌న‌కు కేంద్ర స‌హాయ‌మంత్రి ప‌ద‌వి ఇస్తానంటే సున్నితంగా తిర‌స్క‌రించాన‌ని.. వాజ్‌ పేయ్ ప్ర‌భుత్వంలో ఆర్థిక‌మంత్రిగా తొల‌గించి బేకార్ విదేశాంగ శాఖ‌ను అప్ప‌గించినా తాను ఏమీ అన‌లేద‌న్నారు. విదేశాంగ శాఖ ప‌నికిమాలిన శాఖ అన్న ఆయ‌న‌.. కావాలంటే ఆ విష‌యాన్ని ఇప్ప‌టి విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌ ను అడిగి తెలుసుకోవ‌చ్చన్నారు. జైట్లీ మాదిరి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి తాను పాతికేళ్ల స‌మ‌యం తీసుకోలేద‌ని.. తొలిసారి 2014 ఎన్నిక‌ల్లో అమృత్‌ స‌ర్ నుంచి పోటీ చేసి జైట్లీ ఓడిపోవ‌టాన్ని గుర్తు చేశారు.

తాను జైట్లీని వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ‌లేద‌ని.. ఆయ‌న ఆర్థిక‌మంత్రి కాబ‌ట్టి త‌న వ్యాఖ్య‌లు ఆయ‌న‌కు వ‌ర్తిస్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. జైట్లీ ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి గెలిస్తే ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుస్తాయ‌న్న య‌శ్వంత్‌.. తాను చిదంబ‌రం వృత్తిప‌రంగా ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకునేవాళ్ల‌మ‌ని.. కానీ వ్య‌క్తిగ‌తంగా మాత్రం కాద‌న్నారు. సెంట్ర‌ల్ హాల్లో అంద‌రం క‌లిసి వేడి వేడి టీ తాగుతామ‌ని రాజ‌కీయంగా మాత్ర‌మే విరోధులం త‌ప్పించి వ్య‌క్తిగ‌తంగా మాత్రం కాద‌న్నారు. రానున్న రోజుల్లో ప‌దే ప‌దే దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌నం గురించి ప‌లు అంశాలు లేవ‌నెత్త‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. మోడీ బ్యాచ్‌కు ఇది క‌చ్ఛితంగా దుర్వార్తే న‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.