Begin typing your search above and press return to search.

స‌న్మానం చేస్తానంటూ ఇంటికి వెళ్లుడేంది వంశీ?

By:  Tupaki Desk   |   3 May 2019 8:24 AM GMT
స‌న్మానం చేస్తానంటూ ఇంటికి వెళ్లుడేంది వంశీ?
X
ఓట‌మి భ‌యం టీడీపీ నేత‌ల్ని వెంటాడుతుందా? ఉద్రిక్త‌ల్పి పెంచేలా చేస్తుందా? పోలింగ్ నాటి వేడి.. ఇప్ప‌టికే చాలాచోట్ల త‌గ్గినా.. కొన్నిచోట్ల మాత్రం కార్చిచ్చు మాదిరి కాలుతూనే ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఇలాంటిదే కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఉందంటున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థికి వ‌ల్ల‌భ‌నేని వంశీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు పోటీ చేశారు.

నామినేష‌న్ల మొద‌లు పోలింగ్ వ‌ర‌కూ గ‌న్న‌వ‌రంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఊహించ‌ని రీతిలో టీడీపీ అభ్య‌ర్థికి ధీటుగా యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావ్ పోటీని ఇవ్వ‌టం.. గెలుపు అవ‌కాశాలు ఆయ‌న‌కే ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేని టీడీపీ అభ్య‌ర్థి వ‌ల్ల‌భ‌నేని వంశీ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణలు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. దీనికి బ‌లం చేకూరేలా ఆయ‌న తీరు ఉండ‌టం గ‌మ‌నార్హం. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు తిరుగులేద‌ని భావించిన వంశీకి భిన్న‌మైన వాతావ‌ర‌ణం చోటు చేసుకోవ‌టాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నారు. దీంతో.. ఆయ‌న బెదిరింపుల‌కు దిగుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

తాజాగా.. జ‌గ‌న్ పార్టీ అభ్య‌ర్థి ఇంటికి రెండుసార్లు వంశీ వెళ్ల‌టం.. వెంక‌ట్రావు ఇంట్లో ఉన్నాడా? అని అడ‌గ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ప్ర‌ధాన పార్టీ అభ్య‌ర్థులుగా ఉన్న‌ప్పుడు.. ఇద్ద‌రి మ‌ధ్య సానుకూల వాతావ‌ర‌ణం లేన‌ప్పుడు పిల‌వ‌ని పేరంటం మాదిరి వంశీ ఇంటికి రావ‌టం.. వాక‌బు చేయ‌టం లాంటివి బాగోలేద‌న్న మాట వినిపిస్తోంది.

అంతేకాదు.. వెంక‌ట్రావుకు ఫోన్ చేసి.. నువ్వు గెల‌వ‌బోతున్నావు క‌దా.. స‌న్మానం చేయాలి.. ఎప్పుడు క‌లుస్తావంటూ వంశీ చేస్తున్న వ్యాఖ్య‌ల మ‌ర్మం ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చంటున్నారు. వంశీ తీరుతో విసిగిన వెంక‌ట్రావ్ తాజాగా విజ‌య‌వాడ సీపీని క‌లిశారు. త‌న‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నారంటూ వంశీపై ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ వ్య‌వ‌హారంపై వంశీ వాద‌న మ‌రోలా ఉంది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు భారీగా పెరిగాయ‌ని.. వాటిని త‌గ్గించేందుకే తాను చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. చ‌ర్చ‌ల‌కే పిలుపులు అయితే.. గెలుస్తున్నావుగా.. సన్మానం చేస్తున్నావ్ లాంటి మాట‌లు ఉండ‌వు క‌దా? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది. రాజీ చేసుకునేలా వంశీ వ్యాఖ్య‌లు లేవ‌ని జ‌గ‌న్ పార్టీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా ఎందుకు.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కూ వంశీ కాస్త ఆగితే స‌రిపోతుంది క‌దా?