Begin typing your search above and press return to search.

బాబూ.. యార్ల‌గ‌డ్డ చెప్పింది విన్నారా?

By:  Tupaki Desk   |   25 Sep 2017 9:49 AM GMT
బాబూ.. యార్ల‌గ‌డ్డ చెప్పింది విన్నారా?
X
ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ విద్యా వేత్త‌ - హిందీ గురువు - ర‌చ‌యిత ఆచార్య యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ అదిరిపోయే క్లాస్ ఇచ్చారు. నిజానికి యార్ల‌గ‌డ్డ చాలా మృదు స్వ‌భావి. ఎప్పుడూ పాల‌నా విష‌యాల్లో జోక్యం చేసుకునే ర‌కం కాదు. అయినా కూడా బాబు పాల‌న చూసి - ఆయ‌న వ్య‌వ‌హార శైలి చూసి చిర్రెత్తుకొచ్చింద‌ట‌! అందుకే ఇప్పుడు నేరుగా ఆయ‌న బాబు పాల‌న‌లో వేలు పెట్టేశాడు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను చూసి నేర్చుకో అంటూ పెద్ద ఎత్తున క్లాస్ పీకారు. ఇంటర్‌ వరకు తెలుగు భాష తప్పనిసరి విషయంలో కేసీఆర్‌ ను చూసి నేర్చుకోవాలని యార్లగడ్డ హితవు పలికారు.

తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై తెలుగు వ్యక్తిగా ఎంతో గర్విస్తున్నానన్నారు. ఈ విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు లక్ష్మీ ప్ర‌సాద్‌. ఇంటర్‌ వరకు తెలుగును తప్పనిసరి చేస్తామని మూడేళ్లుగా చెబుతున్న బాబు.. ఇప్పటి వరకు హామీని అమలు చేయలేదని విమర్శించారు. ఏటా గిడుగు రామ్మూర్తి పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చే ఉపన్యాసంలో తెలుగు భాషను తప్పనిసరి చేస్తామని బాబు చెబుతున్నా ఆచరణలో విఫలమయ్యారని దుయ్యబట్టారు.

ప్రభుత్వ కార్యక్రమాలు - శిలాఫలకాలను తెలుగులోనే ముద్రించాలని జీవో జారీ చేసినా అమలు చేయడం లేదని మండిపడ్డారు. గోదావరి పుష్కరాల చివరి రోజున చంద్రబాబు ప్రసంగిస్తూ.. రాజమండ్రిలో తెలుగు విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. సో.. మొత్తానికి యార్ల‌గ‌డ్డ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు. బాబు హామీలు ఎప్పుడూ నీటిపై రాత‌ల్లానే ఉంటాయ‌ని విప‌క్ష నేత విమ‌ర్శించిన‌ప్పుడు తెలుగుదేశం త‌మ్ముళ్లు పెద్ద ఎత్తున రెచ్చిపోయారు. ఇక‌, ఇప్పుడు బాబుకు అత్యంత స‌న్నిహితుడు ల‌క్ష్మీప్ర‌సాదే ఏకేశారు. మ‌రి దీనికి ఎలా రియాక్ట్ అవుతారో? లేదా మౌనంగా ఉంటారో చూడాలి.