Begin typing your search above and press return to search.

ఆత్మ‌గౌర‌వానికి అర్థం మార్చేసిన బాబు

By:  Tupaki Desk   |   1 Nov 2018 2:30 PM GMT
ఆత్మ‌గౌర‌వానికి అర్థం మార్చేసిన బాబు
X
సేవ్ నేషన్ పేరిట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు బ‌య‌ల్దేరిన‌ సంగతి తెలిసిందే. గురువారం హస్తినకు వెళ్లిన తరువాత బీజేపీయేతర పార్టీలతో బాబు భేటీ అవుతున్నారు. బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా ఉండాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలని బాబు పిలుపునిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో రాజ‌కీయంగా బ‌ద్ధ శ‌త్రువు మ‌రియు సిద్ధాంత ప‌రంగా విరోధి అయిన కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్ట‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల‌ను విస్మ‌యానికి గురిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ వ్య‌తిరేక‌ వేదిక అంటూ బాబు తీసుకుంటున్న నిర్ణ‌యాలు పార్టీ నేత‌ల‌ను సైతం ఆవేద‌నకు గురిచేస్తున్నాయ‌నే టాక్ ఉంది. తాజాగా ఇదే త‌ర‌హా ఆవేద‌న‌ను మాజీ ఎంపీ యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ వెలిబుచ్చారు. ఆత్మ‌గౌర‌వాన్ని చంద్ర‌బాబు ఏనాడో మంట‌గ‌లిపార‌ని మండిప‌డ్డారు.

ఇటీవలే ఢిల్లీ వెళ్లివచ్చిన బాబు గురువారం ఉదయం మరోసారి హస్తినకు చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగగానే కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ తో బాబు భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికలు..మహా కూటమి అభ్యర్థుల ఖరారు..పొత్తులు తదితర విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాహుల్ భేటీ కంటే ముందుగానే బాబును ఆజాద్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంత‌రం - కాంగ్రెస్ పార్టీతో ఎల్ల‌ప్పుడూ స‌ఖ్య‌త‌తో ఉండే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఆయ‌నతో భేటీ అయ్యారు . అక్క‌డే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాతో కూడా స‌మావేశం అయ్యారు .

ఇలా హాట్‌హాట్ ప‌రిణామాలు సాగుతున్న క్ర‌మంలో టీడీపీ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దివంగ‌త ఎన్టీఆర్ నాటి ఉదంతాన్ని ప్ర‌స్తావించారు. ``బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో కాంగ్రెసోళ్లు పక్కన కూర్చుంటే దిగి వెళ్లి పోవాలని నాడు ఎన్టీఆర్ చెప్పారు. ఆత్మ‌గౌర‌వాన్ని ఉద‌హ‌రిస్తూ...ఆయ‌నీ మాట‌లు వెల్ల‌డించారు. కానీ...నేడు ఆత్మగౌరవం అంటే అధికారమే. ఆత్మగౌరవానికి అర్థం మారిపోయింది. అమరావతి పేరు నామ‌ఫలకంపై ఇంగ్లీషులో రాసిన నాడే ఆత్మగౌరవం పోయింది`` అంటూ బాబు పేరు ఎత్త‌కుండానే..ఆయ‌న తీరును తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. టీడీపీ సీనియ‌ర్ల‌ - అన్న‌గారి ఆత్మీయులు అనే పేరున్న నేత‌ల చెందుతున్న ఆవేద‌నపై బాబు స్పందిస్తారో లేదా తుంగ‌లో తొక్కేస్తారో వేచిచూడాల్సిందే.