Begin typing your search above and press return to search.

ఇలాంటి కెలుకుడు అవసరమా యనమల?

By:  Tupaki Desk   |   12 Oct 2015 2:41 PM GMT
ఇలాంటి కెలుకుడు అవసరమా యనమల?
X
అనవసర సమయాల్లో కెలకటం ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో. అమ్మ పెట్టా పెట్టదు.. అడక్క తినానీదన్నట్లుగా ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదా విషయంలో.. ఏపీ అధికారపక్షం వైఖరిపై ఏపీ ప్రజలు కాస్తంత గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.

ఏపీ ప్రయోజనాల కోసం ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టి ఆరు రోజులు గడిచింది. ఇంతకాలం కామ్ గానే ఉన్న యనమల.. జగన్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ.. అయ్యో పాపం అని ఏపీ జనాలు అనుకునే వేళ.. ఉన్నట్లుండి ఏదో గుర్తుకు వచ్చినట్లుగా జగన్ చేస్తున్న దీక్ష పై చిత్రమైన ఆరోపణలు చేయటం ఆశ్చర్యం కలిగించక మానదు.

భావోద్వేగాలు బయటపడే వేళలో.. వీలైనంత మౌనానికి మించిన మందు మరొకటి ఉండదు. అందుకు భిన్నంగా రెచ్చగొట్టే మాటల్ని ప్రెస్ నోట్ రూపంలో విడుదల చేసిన యనమల వైఖరిపై సర్వత్రా మండిపాటు వ్యక్తమవుతోంది.

జగన్ మనస్తత్వం గురించి.. ప్రవర్తన గురించి ప్రస్తావిస్తూ.. టీడీపీ మీడియా కమిటీ ఛైర్మన్ ప్రసాద్ సంతకం చేసి మరీ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో యనమల వ్యాఖ్యలు ఉన్నాయి. అందులో.. జగన్ చేస్తున్న దీక్ష గురించి నిశితంగా విమర్శలు సంధించిన యనమల.. జగన్ షుగర్ లెవల్ ఎందుకు పెరిగిందో చెప్పాలంటూ లా పాయింట్ తీశారు. సున్నితమైన సమయాల్లో జనాలకు పెద్దగా పట్టని అంశాల్ని ప్రస్తావించటం ఏమిటన్న మండిపాటు వ్యక్తమవుతోంది.

రాజకీయ స్వార్థం కోసమే దీక్ష చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. దీక్షతో ఆరోగ్యం క్షీణిస్తున్న వేళ.. మాటలతో మరింత రెచ్చగొట్టే కన్నా.. కామ్ గా ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. రాజధాని భూముల సేకరణ విషయంలోనూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద అనవసర వ్యాఖ్యలు చేసి.. ఏపీ సర్కారుకు కొత్త తలనొప్పులు తెచ్చిన యనమల.. తాజాగా చేసిన వ్యాఖ్యలు మరెంత మంట పుట్టిస్తాయన్నది ప్రశ్నగా మారింది.