Begin typing your search above and press return to search.

అదృశ్యమైన యానాం స్వతంత్ర అభ్యర్థి..కాకినాడలో ఆ పరిస్థితిలో ప్రత్యక్షం..ఏమైంది !

By:  Tupaki Desk   |   5 April 2021 10:14 AM IST
అదృశ్యమైన యానాం స్వతంత్ర అభ్యర్థి..కాకినాడలో ఆ పరిస్థితిలో ప్రత్యక్షం..ఏమైంది !
X
ఏప్రిల్ 1 నుంచి కనిపించకుండాపోయిన యానాం స్వతంత్ర అభ్యర్థి పెమ్మాడి దుర్గాప్రసాద్ ఆచూకీ దొరికింది. యానాంలో అదృశ్యమైన ఆయన కాకినాడలో ప్రత్యక్షం అయ్యారు. ఆయన ఓ చోట అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దీనితో ఆయన్ని గుర్తించిన స్థానికులు.. 108కి సమాచారం ఇచ్చి చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌ కు తరలించారు. కాకినాడ గ్రామీణం అచ్చంపేట సామర్లకోట రోడ్డులో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని పెమ్మాడి దుర్గా ప్రసాద్‌ గా గుర్తించారు. కాగా, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భాగంగా ఉన్న యానాంలో పోటీ చేస్తున్న అభ్యర్థి కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించగా, ఆయన్ను ప్రధాన రాజకీయ పార్టీల నేతలు అపహరించారని కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.

దీంతో పుదుచ్చేరి నుంచి ప్రత్యేకంగా వచ్చిన సీనియర్ ఎస్పీ రాహుల్ ఆల్వాల్ విచారణ ప్రారంభించారు కూడా. పెమ్మాడి గతంలో యానాం బిజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ స్థానంలో బీజేపీ టిక్కెటు కోసం ప్రయత్నించారు. అయితే, ఎన్డీయే కూటమి తరఫున మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.రంగసామి యానాం నుంచి పోటీకి దిగడంతో ఆయనకు టిక్కెట్ రాలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా దుర్గాప్రసాద్‌ పోటీకి దిగారు. క్రమశిక్షణ చర్యల కింద ఆయన్ని బీజేపీ సస్పెండ్‌ చేసింది. ఈ పరిణామాలతో ఆగ్రహించిన బీజేపీ అధిష్ఠానం దుర్గా ప్రసాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

ఆపై గత గురువారం నాడు ఇంటి నుంచి వెళ్లిన ఆయన, తిరిగి రాకపోవడంతో ఆయన భార్య శాంతి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా, ఆసుపత్రిలో కొంతమేరకు స్పృహలోకి వచ్చిన దుర్గా ప్రసాద్, తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తెలపడం గమనార్హం. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి అదృశ్యం కావడం పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పుదుచ్చేరి అసెంబ్లీకి మంగళవారమే పోలింగ్ జరగనుంది.