Begin typing your search above and press return to search.

బాబుకు దెబ్బ‌!.. వైసీపీలోకి య‌ల‌మంచిలి!

By:  Tupaki Desk   |   30 March 2018 5:23 PM GMT
బాబుకు దెబ్బ‌!.. వైసీపీలోకి య‌ల‌మంచిలి!
X
ఏపీలో ఇప్పుడు ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం న‌డుస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఓ వైపు ఉవ్వెత్తున ఉద్య‌మం సాగుతుండ‌గా - 2019 ఎన్నిక‌ల్లో అధికారమే ల‌క్ష్యంగా విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట చేప‌ట్టిన సుదీర్ఘ పాద‌యాత్ర ఇప్పుడు న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధానికి అతి స‌మీపంలోకి వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలో కొన‌సాగుతున్న జ‌గన్ యాత్ర త్వ‌ర‌లోనే రాజ‌ధాని ప్రాంతానికి చేరుకోనుంది. ఆ త‌ర్వాత రాష్ట్రంలోనే రాజ‌కీయంగా కీల‌క జిల్లాగా ప‌రిగ‌ణిస్తున్న కృష్ణా జిల్లాలోకి - ఏపీకి పొలిటికల్ కేపిట‌ల్‌ గా ఎదిగిన విజ‌య‌వాడ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లోని త‌న తండ్రి స‌మాధి ఉన్న ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన జ‌గ‌న్ యాత్ర రాయ‌ల‌సీమ జిల్లాల‌ను చుట్టేసి... నెల్లూరు - ప్ర‌కాశం జిల్లాల‌ను దాటేసింది. అయితే జ‌గ‌న్ యాత్ర‌కు ఆదిలోనే దెబ్బ తీసేందుకు పెద్ద ఎత్తున వైసీపీ నేత‌ల‌ను లాగేయాల‌ని టీడీపీ ప‌క్కా ప్లాన్ చేసింది. అయితే అంత పెద్ద‌గా పేరున్న నేత‌లేమీ వైసీపీ నుంచి టీడీపీలోకి రాలేదు. దీంతో త‌మ వ్యూహం బెడిసికొట్టింద‌ని భావిస్తున్న టీడీపీకి... జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అంత‌కంత‌కూ పెరుగుతున్న జనం మ‌ద్ద‌తు మ‌రింత‌గా బీపీ పెంచేస్తోంది.

ఇలాంటి కీల‌క త‌రుణంలో గుంటూరు జిల్లాలో అది కూడా టీడీపీ సీనియ‌ర్ నేత‌ - స్పీకర్ కోడెల శివ‌ప్ర‌సాద్ సొంత నియోజ‌క‌వ‌ర్గం స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నేత నిమ్మ‌కాయ‌ల రాజ‌నారాయ‌ణ వైసీపీ తీర్థం పుచ్చుకుని టీడీపీకి పెద్ద షాకే ఇచ్చారు. స‌త్తెన‌ప‌ల్లితో పాటుగా కోడెల‌కు మంచి ప‌ట్టున్న న‌ర‌స‌రావుపేట‌లోనూ జ‌గ‌న్ యాత్ర‌కు పోటెత్తిన జ‌నాన్ని చూసిన టీడీపీ అధినేత‌- ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు డంగైపోయార‌న్న వార్త‌లు కూడా వినిపించాయి. అంత‌కంత‌కూ వైసీపీకి మ‌ద్ద‌తు పెరుగుతున్న ద‌రిమిలానే జ‌నం కూడా జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు నీరాజ‌నాలు ప‌లుకుతున్నార‌ని కూడా టీడీపీ శ్రేణులు త‌మ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో కుత‌కుత‌లాడుతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో మ‌రో బాంబు లాంటి వార్త టీడీపీ నేత‌ల‌ను భారీ షాక్‌ కే గురి చేస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఆ బాంబులాంటి వార్త అస‌లు విష‌యంలోకి వస్తే... ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న విజ‌య‌వాడ తూర్పు నియోజ‌కవ‌ర్గ మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి వైసీపీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం

2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వర్గం నుంచి బ‌రిలోకి దిగిన ర‌వి... నాడు పీఆర్పీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన వంగ‌వీటి రాధాకృష్ణ‌పై కేవ‌లం 187 ఓట్లే తేడాతో విజ‌యం సాధించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా విజ‌య‌వాడ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న నేత అయిన రాధాకృష్ణ‌ను య‌లమంచిలి ఓడించ‌డం నాడు సంచ‌ల‌నం రేకెత్తించింది. టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రికి అత్యంత స‌మీప బంధువుగా అయిన ర‌వి... ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లో కాస్తంత సైలెంట్ గానే ఉండిపోయారు. ఇటీవ‌లి కాలంలో మ‌ళ్లీ యాక్టివ్ అయిన య‌ల‌మంచిలి... ప్ర‌త్యామ్నాయం కోసం వేచి చూస్తున్న‌ట్లుగా వార్త‌లు వినిపించాయి. ఈ క్ర‌మంలో టీడీపీకి ప్ర‌త్యామ్నాయంగా వైసీపీ మిన‌హా మ‌రే పార్టీ ఆయ‌న‌కు కనిపించ‌లేదు. అదే స‌మ‌యంలో వైసీపీ నేత‌లు కూడా య‌ల‌మంచిలితో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంతో ఇరువ‌ర్గాలు కూడా ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం. జ‌గ‌న్ యాత్ర విజ‌య‌వాడ‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోజునే య‌ల‌మంచిలి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ లెక్క‌న జ‌గ‌న్ యాత్ర వ‌చ్చే నెల 10న జ‌గ‌న్ యాత్ర విజ‌య‌వాడ‌లోకి ఎంట్రీ ఇస్తుండ‌గా, అదే రోజున య‌ల‌మంచిలి త‌న అనుచ‌ర వ‌ర్గంతో క‌లిసి వైసీపీలో చేర‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ ప‌రిణామం వైసీపీతో కొత్త ఉత్సాహాన్ని నింపనుండ‌గా. అధికార టీడీపీకి మాత్రం భారీ షాక్ త‌గ‌ల‌నుంద‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.