Begin typing your search above and press return to search.

యాదాద్రి ఎలా ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

By:  Tupaki Desk   |   26 Dec 2016 8:23 AM GMT
యాదాద్రి ఎలా ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
X
కేవలం పాలకుల నిర్లక్ష్యంతో కొన్ని ప్రాంతాలు తీవ్రంగా వెనుకబడి పోతుంటాయి. వాటి విషయంలో ప్రభుత్వాలు దృష్టి పెడితే.. అవెలా మారిపోతాయనటానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది యాదాద్రి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు యాదగిరిగుట్టగా పిలుచుకునే ఈ వైష్ణవ పుణ్యక్షేత్రానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ.. దాన్ని పూర్తి స్థాయిలో మార్చేయాలన్న ఆలోచన ఏ పాలకులకీ రాలేదని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. వ్యక్తిగతంగా యాదగిరి గుట్టపై ఫోకస్ చేయటం.. దాని పేరును యాదాద్రిగా మార్చేయటం.. దాన్ని మాస్టర్ ప్లాన్ లోకి తీసుకొచ్చి.. మొత్తంగా మార్చేయటంతో పాటు.. రానున్న రోజుల్లో తెలంగాణ తిరుమలగా యాదగిరి గుట్టను మార్చాలన్న సంకల్పాన్ని తీసుకున్నారు. రూ.వంద కోట్ల వ్యయంతో యాదాద్రిని మొత్తంగా మార్చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలతో ఈ పుణ్యక్షేత్రంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

సినిమా రంగానికి చెందిన ఆనంద్ సాయి నేతృత్వంలో ఇప్పటికే యాదాద్రికి సంబంధించిన నమూనాలు సిద్ధమయ్యాయి. రానున్న రోజుల్లో యాదాద్రిని ఎలా మార్చున్నున్నారన్నది చూస్తే.. వావ్ అనిపించక మానదు. అంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. లక్ష మంది వచ్చినా స్వామివారి దర్శనం సులువుగా పూర్తి అయ్యేలా ప్రత్యేక సముదాయంతో కూడిన నిర్మాణం. బస్సు టెర్మినల్ నుంచి క్యూ కాంప్లెక్స్ కు చేరే భక్తులకు అవసరమైన వసతులతో పాటు.. ఒక్కో క్యూ కాంప్లెక్స్ లలో ఆరువేల మంది భక్తులు కూర్చునే ఏర్పాటు చేయనున్నారు.

ప్రధాన ఆలయం.. దర్శన సముదాయాల మధ్య గుహ లాంటిది ఏర్పాటు చేయనున్నారు. స్వయంభువుల దర్శనానికి వెళ్లటానికి ఆ గుహ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. నరసింహుడి 32 రూపాల్ని ఆ మార్గాల్లో ఏర్పాటు చేసేలా చేస్తున్నారు. ఇక.. దర్శన వరుసల్లో ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో.. దర్శనం సాఫీగా సాగటంతో పాటు.. వేగంగా సాగే అవకాశం ఉంది. ఇక.. యాదాద్రిలో ఏర్పాటు చేయనున్న బస్ టెర్మినల్ విమానాశ్రయాన్ని తలపించేలా ఉండనుంది. దీని కిందనే భక్తుల వాహనాలకు పార్కింగ్ సెల్లార్లు ఏర్పాటు చేయనున్నారు.

ఇక.. యాదాద్రికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాలు ఉచితంగా అందచేయటానికి ప్రత్యేక వసతి ఏర్పాటు తోపాటు..పిల్లలకు ఆటస్థలం.. వృద్ధులు సేద తీరేందుకు విశ్రాంతి ప్రాంగణాలు.. వ్రతాలు చేసుకునేందుకు అనువైన మండపాలు.. ఇలా యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాల్ని ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ పూర్తి కావటానికి మరికొన్నేళ్లు పట్టినా.. అవి మొత్తం పూర్తి అయితే మాత్రం.. యాదాద్రి పుణ్యక్షేత్రం ఇమేజ్ మొత్తంగా మారిపోవటం ఖాయమని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/