Begin typing your search above and press return to search.

ప్రపంచాన్ని కదిలిస్తున్న వైరల్ ఫోటో.. వూహాన్ ఎలా ఉందో చెప్పటమే కాదు..

By:  Tupaki Desk   |   7 March 2020 2:00 AM IST
ప్రపంచాన్ని కదిలిస్తున్న వైరల్ ఫోటో.. వూహాన్ ఎలా ఉందో చెప్పటమే కాదు..
X
ఎన్నో మాటల్లో చెప్పలేని భావాల్ని ఒక్క ఫోటోతో చెప్పేయొచ్చు. ఇవాల్టి రోజున నిత్యం కోట్లాది ఫోటోలు తీసినా.. కొన్ని మాత్రమే ప్రపంచాన్ని కదిలిస్తుంటాయి. ఆ కోవకే చెందుతుందీ ఫోటో. దీని వెనుకున్న కథ మనసుల్ని హత్తుకోవటమే కాదు.. ఆ పెద్దాయన ఆరోగ్యం వెంటనే కుదుట పడాలని మనస్ఫూర్తిగా కోరుకోవటం ఖాయం. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనాకు పుట్టినిల్లు అయిన వూహాన్ మహా నగరంలోని ఆసుపత్రికి చెందిన ఈ ఫోటో వెనుక అసలు కథేమిటంటే?

వందలాది మంది ఇప్పటికే వూహాన్ నగరంలో కరోనా బారిన పడి మరణించటం తెలిసిందే. దీంతో.. ఈ మాయదారి పిశాచి వైరస్ అంతు చూసేందుకు చైనా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇలాంటివేళ.. ఏ నిమిషాన.. ఎటువైపు నుంచి వైరస్ విరుచుకుపడిపోతుందన్న భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న దుస్థితి.

ఇలాంటివేళ.. నిర్మానుష్యంగా మారిన వూహాన్ లోని ఒక ఆసుపత్రి బయట.. స్ట్రెచర్ మీద ఒక వయసుడిగిన వ్యక్తి సూర్యోదయాన్ని అలా చూస్తుండి పోతుంటే.. అతడి పక్కనే వైద్యుడు వెలుగులు జిమ్ముతున్న సూరీడ్ని చూస్తుండిపోయాడు. 87 ఏళ్ల పెద్దాయనకు గత నెలలో కరోనా లక్షణాలతో ఆసుపత్రి లో చేరాడు. పరీక్షలు నిర్వహిస్తే.. పాజిటివ్ అని తేలింది. దీంతో.. అతడ్నిహాస్పిటల్ లోనూ బందీగా ఉంచి.. చికిత్స చేస్తున్నారు. అతడికి సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించేందుకు వైద్యుడు తీసుకెళుతూ.. ఏదో తట్టినట్లు గా ఆగాడు.

స్టెచర్ లో నీరసించి పోయిన సదరు రోగిని.. సూర్యోదయం చూస్తావా? అని అడగటం.. అతను ఓకే చెప్పటం తో అతన్ని అలా బయటకు తీసుకొచ్చాడా వైద్యుడు. ఆసుపత్రి బయట.. నిర్మానుష్యం గా మారిన పరిసరాల్లో వారిద్దరూ వెలుగులు జిమ్ముతున్న సూరీడు వంక చూస్తుండి పోయారు. ఇదిలా ఉంటే.. వీరిద్దరిని గమనించిన ఒక వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఈ ఫోటో కాస్తా వైరల్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోటోను పలువురు స్పందిస్తున్నారు. అతని జీవితం ఆస్తమించకూడదని.. సూర్యోదయంలా వెలుగులు జిమ్మాలని.. అతను పూర్ణాయువుగా నిలవాలని కోరుకుంటున్నారు. ఆ పెద్దాయన త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరోనా పిశాచి పుణ్యమా అని వూహాన్ మహా నగరం ఎలా మారిందన్న విసయాన్ని ఈ ఫోటోను నిశితంగా పరిశీలిస్తే ఇట్టే అర్థం కాక మానదు. కరోనా ముందు వరకు నిత్య చైతన్యంతో వెలిగిన ఈ సిటీ.. హాలీవుడ్ మూవీ లో మాదిరి.. మహా విధ్వంసం తర్వాత శశ్మాన నిశ్శబద్ధం తాండవిస్తున్నట్లు గా ఉండటం గమనార్హం.