Begin typing your search above and press return to search.

ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్న వూహాన్ సిటీ తాజా వీడియో

By:  Tupaki Desk   |   11 Feb 2020 4:44 AM GMT
ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్న వూహాన్ సిటీ తాజా వీడియో
X
ఇదిగో తోక అంటే అదిగో పులి అనటం ఇప్పుడేం కొత్త కాదు. మొదట్నించి ఉన్నదే. కాకుంటే.. అప్పట్లో కేవలం మాటలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు భయపెట్టేందుకు అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని వాడేస్తున్నారు. కంటి ముందు కనిపిస్తున్నదంతా నిజమేనన్న భావన కలిగేలా మాయ చేస్తున్న వైనంలో అసలు నిజం ఏమిటన్నది తేలాలంటే కచ్ఛితంగా విచక్షణను వినియోగించాల్సిందే.

తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రపంచాన్ని ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తోంది. దాదాపు 15 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో వూహాన్ మహానగరానికి చెందినది. ఈ వీడియో చూస్తే చాలు.. వూహాన్ ఎంత పెద్ద నగరమో ఇట్టే అర్థమవుతుంది. కనుచూపు మేర పెద్దపెద్ద టవర్స్ కనిపించటం ఒక ఎత్తు అయితే.. రాత్రి వేళ లో తీసిన ఈ వీడియో లో.. ప్రజలు పెద్ద ఎత్తున అరుస్తున్నారు. ఈ అరుపులకు ఎవరికి వారు వారికి తోచిన అర్థాలు చెబుతూ.. సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.

అలాంటి పనే చేశారు బ్రిజేష్ మిశ్రా అనే జర్నలిస్టు. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ఆయన.. కరోనా వైరస్ బారిన పడిన వూహాన్ నగరంలోని ప్రజలు.. ఇళ్లల్లో బందీలుగా మారి.. తమను కాపాడాలంటూ పెద్ద ఎత్తున అరుస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇది కాస్తా సంచలనం గా మారింది. వూహాన్ లో నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? అన్నది చూస్తే ఆసక్తికరంమారింది. సదరు జర్నలిస్టు చెప్పిన దాన్లో వాస్తవం మాటేమిటన్నది క్రాస్ చెక్ చేస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.

కరోనా వైరస్ ధాటికి వూహాన్ నగరంలోని ప్రజలు ఇళ్లల్లోకే పరిమితమయ్యారు. ఈ వీడియో వూహాన్ నగరానికి చెందినదే. కాకుంటే.. కరోనా వైరస్ ను గుర్తించిన వైద్యుడు మరణించాడన్న విషయాన్ని తెలుసుకున్న వూహాన్ ప్రజలు.. అతడికి తమదైన శైలిలో నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా అపార్ట్ మెంట్ల లో ఉండి పోయిన ప్రజలు.. ఒకరినొకరు ఉత్తేజపర్చుకోవటానికి భారీ ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందుతుందన్న భయంలో ఎవరికి వారు ఇళ్లల్లో ఉండి.. తమ నినాదాలతో తాము ఒంటరులం కామని.. ఒకరికొకరు అండగా ఉన్నామన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ వీడియో స్ఫూర్తి వంతమైనది. ఏ క్షణంలో చావు విరుచుకు పడుతుందో తెలీదు.

కరోనా పిశాచికి హడలి పోవటానికి బదులుగా.. దాన్ని అందరూ కలిసి సమిష్టిగా ఎదుర్కొందామన్నట్లుగా వూహాన్ ప్రజల స్ఫూర్తిని అభినందించాలి. అదే సమయం లో బ్రజేశ్ మిశ్రాలాంటి జర్నలిస్టులు నిజాలు చెప్పకున్నా ఫర్లేదు కానీ కన్ఫ్యూజ్ అయితే అబద్ధాన్ని వైరల్ చేయకుంటే చాలు. అదే పదివేలుగా చెప్పక తప్పదు.