Begin typing your search above and press return to search.

మహమ్మారి వీరంగం ఎంత భారీ అంటే.. రోజు గడిస్తే లక్ష!

By:  Tupaki Desk   |   28 May 2020 4:45 AM GMT
మహమ్మారి వీరంగం ఎంత భారీ అంటే..  రోజు గడిస్తే లక్ష!
X
మాయదారి రోగం ప్రపంచాన్ని కమ్మేస్తోంది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్ లో షురూ అయిన ఈ మహమ్మారి చూస్తుండగానే ఎంతలా విస్తరించిందో చూస్తున్నదే. కంటికి కనిపించని పరిణామంలో ఉంటూ.. దేశాలకు దేశాలు కిందామీదా పడే పరిస్థితికి తీసుకొచ్చింది. దీనికి చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నా.. ఇప్పటివరకూ సరైన ఫలితం వచ్చింది లేదు. ఈ మాయదారి రోగం తీవ్రత ఇప్పుడు మరింత పెరిగింది. పలుదేశాలకు వణుకు పుట్టిస్తున్న దీని తీరుతో రోజుకు లక్ష మంది పాజిటివ్ లుగా తేలుతున్నారు.

ఒకప్పుడు పాజిటివ్ మాట విన్నంతనే ఎంతో హాయిగా ఉండేది. అందుకు భిన్నంగా ఇప్పుడు పాజిటివ్ అన్న మాట వణికిపోయేలా చేస్తోంది. బుధవారం నాటికి 56.78 లక్షల పాజిటివ్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదైతే.. గురువారం నాటికి రూ.57.84లక్షలకు చేరుకుంది. అంటే.. రోజు గడిస్తే లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

ఈ లక్షలో అమెరికా అందరి కంటే ముందుంది. రోజుకు కనీసం 20వేలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. ఈ జాబితాలో పదో స్థానంలో భారత్ ఉంది. ఆ మధ్య వరకూ రోజుకు రెండు మూడు వేల పాజిటివ్ కేసులు నమోదయ్యే దానికి భిన్నంగా ప్రస్తుతం ఆరేడు వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. రోజులు గడుస్తున్న కొద్దీ పాజిటివ్ తీవ్రత పెరిగి పోతోంది. ఇప్పుడున్న పరిస్థితే కొనసాగితే.. రానున్న కొద్ది రోజుల్లో రోజుకు పదివేల కొత్త కేసులకు చేరుకున్నా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు.

భారత్ లోని అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్రను చెప్పాలి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. గతంతో పోలిస్తే.. రోజువారీగా ఎక్కువ కేసులు నమోదవుతున్నా.. ప్రపంచం వ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్ తో పోలిస్తే.. ఈ మాహమ్మారి జోరు కాస్త తక్కువనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో రోజువారీ పాజిటివ్ లు వందకు చేరుకోగా.. తెలంగాణలో మాత్రం అరవై.. డెబ్భైల మధ్య ఊగిసలాడుతోంది. లాక్ డౌన్ సడలింపులు దాదాపుగా ఎత్తివేయటంతో పాటు.. తాజాగా మాల్స్ మినహా కేంద్రం పేర్కొన్న అన్ని వ్యాపారాలు తెరుచుకోవచ్చన్న మాటతో రోడ్ల మీదకు వచ్చే వారి సంఖ్య పెరిగే వీలుంది. అది మరిన్ని పాజిటివ్ కేసులకు కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.