Begin typing your search above and press return to search.

మూడో ప్ర‌పంచ యుద్ధంతో భూమి అంతం: అమెరికా మాజీ అధ్య‌క్షుడి హాట్ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   10 Oct 2022 10:30 AM GMT
మూడో ప్ర‌పంచ యుద్ధంతో భూమి అంతం: అమెరికా మాజీ అధ్య‌క్షుడి హాట్ కామెంట్స్‌!
X
ప్ర‌స్తుతం ర‌ష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొన‌సాగుతూనే ఉన్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మొద‌లైన యుద్ధం ఇంకా ఆగ‌క‌పోవ‌డం ప్ర‌పంచ దేశాల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. యుద్ధాన్ని ఆప‌డానికి ప్ర‌పంచ దేశాలు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ర‌ష్యా, ఉక్రెయిన్ వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇంత జ‌రిగాక ర‌ష్యాతో చ‌ర్చించేదేమీ లేద‌ని ఉక్రెయిన్ తేల్చిచెబుతోంది. మ‌రోవైపు మొద‌ట్లో మంచి విజ‌యాలు సాధిస్తూ ఉక్రెయిన్‌పై రోజుల్లోనే గెలిచేస్తుంద‌నుకున్న ర‌ష్యా ఇప్పుడు వ‌రుస ఎదురుదెబ్బ‌లు తింటోంది. ఉక్ర‌యిన్ గ‌ట్టిగా పోరాడుతుండ‌టంతో ర‌ష్యా మిస్సైళ్ల‌ను దించి భీక‌ర దాడికి పాల్ప‌డుతోంది.

ఈ నేప‌థ్యంలో ర‌ష్యా - ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అజ్ఞానుల కారణంగా ఈ భూమిపై ఏమీ మిగలద‌న్నారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి తక్షణ శాంతియుతంగా చర్చలు జరిపి ముగింపు పలకాలని మనమంతా డిమాండ్‌ చేయాల‌న్నారు. లేదా మూడో ప్రపంచ యుద్ధంతోనే ఇది ముగుస్తుంద‌ని హెచ్చ‌రించారు.

మూడో ప్ర‌పంచ యుద్ధ‌మే జ‌రిగితే మన భూమండలంపై ఏమీ మిగలదు అని ప్రపంచాన్ని డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో నిర్వహించిన ‘సేవ్‌ అమెరికా’ ర్యాలీలో మాట్లాడుతూ.. అణ్వాయుధాల వినియోగంపై ఈ మేర‌కు ట్రంప్ హెచ్చరిక‌లు జారీ చేశారు.

అణ్వాయుధాల వినియోగంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవ‌ల‌ హెచ్చరికలు చేసిన తర్వాత ట్రంప్‌ ఈ మేరకు స‍్పందించడం విశేషం. 1962లో క్యూబా క్షిప‌ణి సంక్షోభం త‌ర్వాత మ‌ళ్లీ 60 ఏళ్లకు న్యూక్లియర్‌ బాంబుల ముప్పు పొంచి ఉందంటూ ఇటీవ‌ల అమెరికా అధినేత జో బైడెన్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అణ్వాయుధాల హెచ్చరికలు జోక్‌ కాదన్నారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిన ‍అవసరం ఉందంటూ ప్రపంచ దేశాల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

గతంలోనూ పలువురు ప్రపంచ నేతలు ఇలాంటి హెచ్చరికలే చేశారు. వరుస హెచ్చరికల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే భావనలు మొదలైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో తాజాగా ఈ అంశంపై స్పందించారు.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. తక్షణం శాంతియుతంగా యుద్ధానికి ముగింపు పలకాలని ఇరు దేశాల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.