Begin typing your search above and press return to search.

ప్రకృతితో గేమ్స్ ఆడితే ఇలా బాక్స్ బద్దలవుద్దీ

By:  Tupaki Desk   |   28 July 2020 1:40 PM IST
ప్రకృతితో గేమ్స్ ఆడితే ఇలా బాక్స్ బద్దలవుద్దీ
X

ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. బతకడానికి అవకాశం కల్పించింది. గాలి, నీరు, ఆహారం, సహజసిద్ధమైన ప్రకృతి సంపద.. జంతుజాలం ఇలా అన్నీ కలగలిపి భూమిపై ప్రాణుల మనుగడకు తోడ్పడింది. కానీ మనిషే.. స్వార్థంతో వాటన్నింటిని నాశనం చేస్తూ ఇప్పుడు ఆ ప్రకృతి ప్రకోపానికి బలైపోతున్నాడు.. మన జీవితంలో ప్రకృతి ప్రాముఖ్యతను.. దాన్ని ఎందుకు పరిరక్షించుకోవాలో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన ‘కరోనా వైరస్’ నేర్పించింది. ప్రకృతిని నాశనం చేస్తే అది పగబడుతుందని మనిషికి అర్థమయ్యేలా ఇప్పుడు విజృంభిస్తోంది. నేడు ‘ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం..

ఈ భూమిపై సమస్తం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది.. చెట్లు ఉంటేనే వర్షాలు పడతాయి.. వర్షాలు పడితేనే పంటలు పండి.. నీటి కొరత తీరి మనుషులు బతుకుతారు.. జంతుజాలం ఉంటేనే ప్రాణ కోటి సమతుల్యత పరిఢవిల్లుతుంది. కానీ మనిషి తన స్వార్థం కోసం అన్నింటిని సొంతానికి వాడుకుంటూ నాశనం చేస్తున్నాడు..

భూమిపై కార్బన్ డై అక్సైడ్ పెరిగిపోతోంది. గ్రీన్ హౌస్ వాయువులు పెరిగిపోతున్నాయి. దీనివల్ల భూమిపై ఆకాశంలో ఉండే ఓజోన్ పొర దెబ్బతింటోంది.. సూర్య కిరణాలు నేరుగా పడి భూమి చివర్లో గడ్డకట్టుకుపోయిన మంచు కరిగి భూమి కుచించుకుపోతోంది. చెట్లు, మొక్కలు నరికివేయడం వల్ల వర్షాలు లేక.. ఎండాకాలంలో తేమ కొరవడి నిప్పులు కురుస్తున్నాయి. ఇదంతా మనిషి స్వయంకృతాపరాధమే..

మనిషి చేస్తున్న తప్పులే ఇప్పుడు అతడిని కబళిస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ ప్రపంచంపై దాడియే నిదర్శనం. అంతకుముందు ఎప్పుడూ చూడని సునామీలు.. భూకంపాలు.. ఇసుక తుఫాన్లతో ప్రకృతి మనల్ని కబళిస్తోంది..

సహజ వనరులను పరిరక్షించేందుకు అవగాహన కల్పించడానికి ఈరోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుతారు. భవిష్యత్ తరాల శ్రేయస్సును కాపాడడానికి మనం ప్రకృతిని పరిరక్షించాలి. అటవీ నిర్మూలన.. అక్రమ వన్యప్రాణుల వ్యాపారం.. కాలుష్యం, ప్లాస్టిక్ లు, రసాయనాలు వాడడం.. నీటిని యథేచ్ఛగా భూగర్భంలోంచి తోడేయడం ఆపేయాలి.

ప్రకృతిని మనం పరిరక్షిస్తే.. అది మనల్ని కాపాడుతుంది. అదే మనం నాశనం చేస్తే అది పగబట్టి నాశనం చేస్తుంది. కరోనా లాంటి వైరస్ లు పుట్టుకు వస్తాయి. కాబట్టి ప్రకృతిని ప్రేమిద్దాం.. హాయిగా జీవిద్దాం.