Begin typing your search above and press return to search.

వాటితో కరోనాకు చెక్ చెప్పలేం..తేల్చేసిన డబ్ల్యూహెచ్ ఓ

By:  Tupaki Desk   |   7 Feb 2020 2:30 AM GMT
వాటితో కరోనాకు చెక్ చెప్పలేం..తేల్చేసిన డబ్ల్యూహెచ్ ఓ
X
అంతకంతకూ విస్తరిస్తూ కొత్త భయాల్ని పుట్టిస్తోంది మాయదారి కరోనా. చైనాలో విలయతాండవం చేస్తున్న కరోనా.. నెమ్మదిగా భారత్ లోకి వస్తోంది. ఇప్పటివరకూ వెలుగు చూసిన కేసులు సింగిల్ డిజిట్ లో ఉన్నప్పటికీ.. ఒకసారి ఈ వైరస్ కానీ వ్యాపించటం మొదలు పెడితే మాత్రం.. భారత్ లాంటి దేశాల్లో కంట్రోల్ చేయటం అంత తేలికేం కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అవగాహన లేమితో పాటు.. కంట్రోల్ చేసే పరిస్థితులు ఉండకపోవటమే దీనికి కారణంగా చెబుతున్నారు.

కరోనా వైరస్ భయాన్ని సొమ్ము చేసుకోవటానికి ఇప్పటికే కొందరు హోమియోపతి మందు ఉందని.. మరికొందరు 21 రోజుల ఉపవాస దీక్షలతో కరోనా దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చంటూ ప్రచారం చేస్తున్నారు. వీటిన్నింటికి మించి.. కొన్ని చిట్కాలు.. మందులు కరోనా వైరస్ ను కంట్రోల్ చేయటానికి అవకావం ఉందన్న వాదనను వాట్సాప్ లలోనూ.. సోషల్ మీడియాలోనూ వినిపిస్తున్నారు. అయితే.. ఇలాంటి ప్రచారాల్లో నిజం ఏ మాత్రం లేదని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చేసింది.

కొన్ని ప్రచారాల ప్రకారం వెల్లుల్లి రసం.. నువ్వులనూనెను ఒంటి నిండా రాసుకోవటం.. మౌత్ వాష్ లు వినియోగించుకోవటం ద్వారా కరోనా వైరస్ ను దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని వస్తున్న సమాచారంలో ఏ మాత్రం నిజం లేదని పేర్కొంది. వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదేనని.. నువ్వులనూనెను ఒంటికి రాసుకోవటం తప్పేం కాదని.. మౌత్ వాష్ తో నోరు తాజాదనంతో ఉంటుందే తప్పించి.. ఇవేమీ కరోనా వైరస్ ను అడ్డుకోలేవని పేర్కొంది.

ఇలాంటి చిట్కాలేమీ కరోనాను నయం చేయలేవని తేల్చింది. అంతేకాదు.. యాంటీ బయోటిక్స్.. హెర్బల్ టీ.. విటమిన్ సీ లాంటివేమీ కరోనాను కంట్రోల్ చేయవని తేల్చింది. కరోనా వైరస్ నుంచి రక్షించే వైరస్ ఇప్పటివరకూ రాలేదని.. దాని చికిత్స కోసం పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపింది. ఈ పరిశోధనలకు డబ్ల్యూహెచ్ ఓ కూడా తన వంతు సహకారాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. కరోనా చికిత్సలపై సాగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది. సో.. కరోనాకు చెక్ పెట్టేస్తాయని చెప్పే వెల్లుల్లి.. నువ్వులనూనె.. మౌత్ వాష్.. హెర్బల్ టీలతో ఎలాంటి ప్రయోజనం లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.