Begin typing your search above and press return to search.

భారత మాతాకీ జై అంటే నోటీసులిస్తారా?

By:  Tupaki Desk   |   12 Aug 2016 7:03 AM GMT
భారత మాతాకీ జై అంటే నోటీసులిస్తారా?
X
ఎవరు దేశాన్ని వారు ప్రేమించటం మామూలే. తమ దేశభక్తిని చాటుకునేందుకు నినాదాలు చేస్తుంటారు. కానీ.. మరే దేశంలో లేని చిత్రమైన వ్యవహారం మన దేశంలోనే కనిపిస్తుంది. ‘‘భారతమాతా కీ జై’’ అనే నినాదాన్ని చేయటాన్ని కొందరు రాజకీయ నాయకులు వ్యతిరేకించటం కనిపిస్తుంది. ఎందుకంటే.. ఆ నినాదానికి మతంతో ముడిపెడతారు. ఎందుకిలా అంటే.. సమాదానం అందరికి తెలిసిందే. ఆ నినాదాన్ని బీజేపీ నేతలు.. సంఘ పరివార్ చేస్తుండటం.. మిగిలిన పార్టీలు ఈ నినాదం పట్ల పెద్ద ఆసక్తి ప్రదర్శించకపోవటంతో.. ఈ నినాదం కొందరు తప్పించి అందరూ చేసేది కాదన్నట్లుగా తయారైంది.

ఆ మధ్యన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అయితే మరో అడుగు ముందుకేసి.. తన గొంతు మీద కత్తి పెట్టినా తాను మాత్రం భారత్ మాతాకీ జై అనని వ్యాఖ్యానించటం దేశ వ్యాప్తంగా ఎంత కలకలం రేపిందో తెలియంది కాదు. దేశ వ్యాప్తంగా అసద్ వ్యాఖ్యలపై మండిపడితే..కొందరు మేధావులు మాత్రం.. భారత్ మాతాకీ జై అనే నినాదంపై పిడివాదనను వినిపించారు. అలాంటి వారి వాదన విన్నప్పుడు కలిగే అభిప్రాయం ఒక్కటే.. దేశానికి సంబంధించిన ఒక నినాదంపై ఇంత చర్చ.. రచ్చ మన దేశంలో మాత్రమే కుదురుతుందని.

ఇదిలా ఉంటే.. తాజాగా గుజరాత్ లో ‘భారత్ మాతాకీ జై’ అన్న నినాదం చేసినందుకు ఒక ఉద్యోగి నోటీసు అందుకోవటం ఇప్పుడు వివాదంగా మారింది. గుజరాత్ లోని కచ్ జిల్లాలోని థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణను దక్షిణ కొరియాకు చెందిన కెప్కో ప్లాంట్ సర్వీస్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీకి అప్పజెప్పారు. వాస్తవానికి దీన్ని గుజరాత్ ఖనిజాభివృద్ధి సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే.. ఈ కంపెనీలో పని చేసే ఉద్యోగి ఒకరు ‘‘భారతమాతాకీ జై’’ అంటూ నినాదాలు చేశారు. అతని భాషను తప్పుగా అర్థం చేసుకున్న కొరియా కంపెనీ అతనికి నోటీసులు జారీ చేసింది. భాషను తప్పుగా అర్థం చేసుకోవటం వల్లే ఇలా జరిగిందని చెప్పినా.. ఇలాంటి నినాదాలు చేయటానికి కంపెనీ వేదిక కాదంటూ సదరు ఉద్యోగికి వార్నింగ్ ఇవ్వటం గమనార్హం.