Begin typing your search above and press return to search.

వారానికి 4 రోజులే పని.. ఆ కంపెనీ సుడి తిరిగిపోయింది

By:  Tupaki Desk   |   25 April 2022 5:30 AM GMT
వారానికి 4 రోజులే పని.. ఆ కంపెనీ సుడి తిరిగిపోయింది
X
వారానికి ఏడు రోజులు. వారం మొత్తం పని చేస్తున్నారు కాబట్టి ఒక రోజు సెలవు ఇవ్వటం తెలిసిందే. ఐటీ పుణ్యమా అని వారానికి రెండు రోజులు విశ్రాంతి.. ఐదు రోజులు పని పేరుతో వర్కు కల్చర్ లో మార్పు వచ్చింది. దేశంలో ఐటీ ఇంతలా కుదురుకున్నప్పటికీ.. వారానికి ఐదు రోజుల పని మీద చాలామందికి గుస్సానే ఉందంటారు. కానీ.. ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ వస్తోంది. అది వారానికి నాలుగు రోజులు మాత్రమే పని.

మిగిలిన మూడు రోజులు విశ్రాంతి. విన్నంతనే నిజమా? అన్న సందేహం కలుగుతుంది కానీ ఇది వాస్తవం. ఒక కంపెనీ ప్రయత్నపూర్వకంగా వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేసి మరీ సక్సెస్ అయ్యింది. లాభాల పంట పండటమే కాదు.. ఉద్యోగులు రాజీనామాలంటూ సంధించే అస్త్రాల్ని మడిచి లోపల పెట్టేసుకున్న వైనం గురించి తెలుసుకోవాల్సిందే.

కరోనాకు ముందు తర్వాత మనిషి జీవితంలో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి. ఆలోచనా ధోరణిని పూర్తిగా ప్రభావితం చేసేలా కరోనా పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. కరోనా వేళలో ఉద్యోగం ఉంటుందో లేదో అన్న భయంతో.. అవసరానికి మించి అత్యధిక గంటలు పని చేసిన ఉద్యోగులు.. ఇప్పుడు వెల్లువెత్తుతున్న కొత్త కొలువుల కోసం వెనుకా ముందు చూసుకోకుండా వెళ్లిపోతున్న ఉదంతాల్ని బోలెడన్ని చూస్తున్నాం.

ఇదే తీరులో ఒక కంపెనీలో పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులు రిజైన్ చేసేశారు. ఆ కంపెనీ పేరు ‘‘హెల్త్ వైజ్’’. అమెరికాకు చెందిన ఈ స్వచ్ఛంద సంస్థలో పని చేసే 200 మంది ఉద్యోగులు ముకుమ్మడిగా రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారు.

దీంతో ఆ కంపెనీ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఇలాంటి వేళ బోస్టన్ కాలేజీలో షోర్ ఎకనామిస్ట్ అండ్ సోషియాలజిస్ట్ విభాగంలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న జూలియట్ షోర్ ను సదరు కంపెనీ సంప్రదించింది. దీనికి కారణం లేకపోలేదు. ఆమె 1990 నుంచి ఉద్యోగులు.. వారి విధులకు సంబంధించి బోలెడంత రీసెర్చ్ చేశారు. ఒక్కసారిగా ఉద్యోగులు సంధించిన రాజీనామాల నేపథ్యంలో ఆమె సలహా.. సూచనల్ని కంపెనీ కోరింది.

దీనికి అంగీకరించిన ఆమె ఉద్యోగులు కోరుకున్న జీతాలతో పాటు.. హోదాల్ని.. వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేసేలా కొత్త ఫార్ములాను సిద్ధం చేసి ఇచ్చారు. దీన్ని అమలు చేసిన హెల్త్ వైజ్ కంపెనీ అనూహ్య ఫలితాల్ని సాధించినట్లుగా చెబుతున్నారు. రిజైన్ చేసిన ఉద్యోగులు వెంటనే వెనక్కి రావటమే కాదు.. వారానికి నాలుగు రోజుల పని విధానంతో ఉద్యోగుల పని తీరులో చాలా మార్పు వచ్చిందని సంస్థ పేర్కొంది. అంతేకాదు.. ప్రస్తుతం ఆ కంపెనీ లాభాల బాట పట్టటమే కాదు.. కొత్త పని విధానానికి సదరు కంపెనీ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని చెప్పాలి.