Begin typing your search above and press return to search.

కృష్ణా, గుంటూరు అనుసంధానం

By:  Tupaki Desk   |   11 Aug 2015 6:17 PM GMT
కృష్ణా, గుంటూరు అనుసంధానం
X
కృష్ణా, గుంటూరు జిల్లాలు ఒక్కటి కానున్నాయి. ఆ రెండింటినీ కలుపుతూ భారీ బ్రిడ్జి రానుంది. నవ్యాంధ్ర రాజధానికి వారధిగా ఇది ఉండనుంది. ఇప్పటికే ఈ రెండు జిల్లాల మధ్యలో ఉన్న కనకదుర్గ వారధికి అదనంగా కృష్ణా జిల్లాలోని గొల్లపూడి, గుంటూరు జిల్లాలోని వెంకటపాలెం మధ్య ఈ బ్రిడ్జి రానుంది.

కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణా నదిపై వంతెనను నిర్మించాలని హైవేస్ అథారిటీ రెండేళ్ల కిందటే ప్రతిపాదించింది. మంగళగిరి వద్ద వై జంక్షన్ నుంచి వెంకటపాలెం, గొల్లపూడి మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను వరకు జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా దీనిని నిర్మించాలని భావించింది. ఇందులో భాగంగా తుళ్లూరు మండలం వెంకటపాలెం – విజయవాడ శివారు గొల్లపూడి మధ్య వంతెన నిర్మాణానికి రూ.1900 కోట్లతో టెండర్లు కూడా పిలిచారు. ఈ టెండరును దక్కించుకున్న గామన్ ఇండియా ఇప్పటి వరకు జాప్యం చేసింది. భూ సేకరణపై కొంతమంది కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు సాంకేతిక సమస్యలన్నీ పరిష్కారం అయిన నేపథ్యంలో అతి త్వరలోనే ఈ వంతెన నిర్మాణం ప్రారంభించాలని భావిస్తున్నారు.

ఈ వంతెన పూర్తయితే ఇటు గుంటూరు నుంచి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు కోస్తాంధ్రకు వెళ్లడానికి చాలా సులభమయవుతుంది. విజయవాడలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది. మరొక్క ముఖ్య విషయం ఏమిటంటే, కృష్ణా నది మధ్యలో పెట్టాలని భావిస్తున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఈ బ్రిడ్జి మీదనే పెట్టాలనే ఆలోచనలు కూడా సాగుతున్నట్లు సమాచారం.