Begin typing your search above and press return to search.

ప్రభుత్వ నిర్ణయంపై ఫైర్.. శృంగారం బంద్ చేస్తామన్న మహిళలు

By:  Tupaki Desk   |   6 Sept 2021 9:33 AM IST
ప్రభుత్వ నిర్ణయంపై ఫైర్.. శృంగారం బంద్ చేస్తామన్న మహిళలు
X
ప్రభుత్వం చేసిన కొత్త చట్టం అక్కడి మహిళలకు కోపాన్ని తెప్పించింది. తమ నిరసనను తెలపాలని డిసైడ్ అయ్యారు. ఇలాంటివేళ.. ఒక సెలబ్రిటీ ఇచ్చిన పిలుపుతో ఇప్పటివరకు ఎప్పుడూ లేని కొత్త సీన్ ఒకటి తెర మీదకు వచ్చింది. ప్రపంచ దేశాల్లో మరెక్కడా లేని రీతిలో ఇప్పుడక్కడ సరికొత్త నిరసన వ్యక్తం కావటమే కాదు.. రానున్న రోజుల్లో మహిళల ప్రయోజనాల్ని దెబ్బ తీసే చట్టాలకు చెప్పుదెబ్బగా ఈ అస్త్రం పనికి వస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ నిరసన ఏమిటో తెలుసా? ఆడవాళ్లు శృంగారం చేయకుండా ఉండటం. ఎట్టి పరిస్థితుల్లో అందుకు నో చెప్పేయాలని డిసైడ్ కావటం. ఇంతకీ ఈ వినూత్న నిరసన ఎక్కడ? ఎందుకింత తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకున్నారు? అన్నది చూస్తే..

టెక్సాస్ ప్రభుత్వం కొత్త అబార్షన్ చట్టాన్ని గత బుధవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీనిపై పలు మహిళా సంఘాలు తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మహిళల హక్కుల్ని దారుణంగా దెబ్బ తీసే ఈ చట్టాన్ని తీసేయాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ దీని గురించి అక్కడి పాలకులు పట్టించుకోవటం లేదు. ఇలాంటివేళ..మహిళల అక్రోశానికి అద్దంపట్టేలా ప్రముఖ నటి కమ్ గాయని బెట్టే మిడ్లర్ మహిళా లోకానికి సరికొత్త పిలుపునిచ్చారు.

మహిళలంతా సెక్సు సమ్మెను చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన కొత్త చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు మహిళలు ఎవరూ పురుషులతో సెక్సు చేయకూడదని ఆమె చెబుతున్నారు. దీనికి పెద్ద ఎత్తున సానుకూల స్పందన రావటం గమనార్హం. గర్భం దాల్చాలా? వద్దా? అనే అంశంపై సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు మహిళలకు ఉండాలన్నది ఆమె డిమాండ్.

ప్రెగ్నెంట్ అయిన ఆరు వారాల వరకు మహిళలకు తాము గర్భవతులమయ్యామన్న విషయం తెలీదని.. కానీ ప్రభుత్వం ఆ గడువును కూడా కుదించటాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒక మహిళ తనకు ఇష్టం లేకుండా జన్మనివ్వాల్సి రావటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. తమ గర్భం గురించి మహిళలు సొంత నిర్ణయం తీసుకునే హక్కును ప్రభుత్వం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బెట్టే పిలుపునకు మహిళల నుంచి సానుకూల స్పందన వస్తోంది. తాము కూడా సెక్సు సమ్మెను చేపడతామని ముందుకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.

కొత్త అబార్షన్ చట్టానికి ఓకే చేస్తూ టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ సంతకం చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని న్యాయస్థానాలు అంగీకరించకపోవటంతో చట్టం అమల్లోకి వచ్చింది. ఇది మహిళల హక్కుల్ని దెబ్బ తీసేలా ఉందన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళల హక్కులకు భంగం వాటిల్లేలా ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు.

కొత్త చట్టం ప్రకారం.. ఇకపై ఆరు వారాల గర్భంతో అబార్షన్ చేయించుకోవాలంటే మహిళలకు సరికొత్త సవాళ్లు ఎదురు కానున్నాయి. ఆరు వారాల తర్వాత గర్భం తొలగించుకోవాలంటే.. వైద్యులు ప్రత్యేక పరీక్షలు చేస్తారు. ఒకవేళ వారి గర్భంలోని పిండంలో గుండె కొట్టుకోవటం మొదలైతే.. తాజా చట్టం అందుకు అంగీకరించదు. దాన్ని ప్రాణమున్న శిశువుగా పరిగణిస్తారు. ఒక్క అత్యవసర వైద్య సందర్భాల్లో మాత్రమే మినహాయింపు ఉంటుంది. దీనిపై మహిళలు షురూ చేసిన సెక్సు సమ్మె ఎక్కడివరకు వెళుతుందో చూడాలి.