Begin typing your search above and press return to search.

ఇంటి ప‌ట్టా ఇవ్వ‌క‌పోతే మీ ఇంటికొచ్చి కూర్చుంటా: ఎమ్మెల్యేకు మ‌హిళ వార్నింగ్!

By:  Tupaki Desk   |   30 July 2022 8:30 AM GMT
ఇంటి ప‌ట్టా ఇవ్వ‌క‌పోతే మీ ఇంటికొచ్చి కూర్చుంటా: ఎమ్మెల్యేకు మ‌హిళ వార్నింగ్!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం అంటూ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు గెల‌వ‌ని చోట ఆయా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జులు ఈ కార్యక్ర‌మం నిర్వ‌హించాల‌ని జ‌గ‌న్ ఆదేశాలు ఇచ్చారు.

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్ల కాలంలో ప్ర‌భుత్వం చేసిన మంచిని వివ‌రించ‌డంతోపాటు సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల ఎంత ల‌బ్ధి చేకూరిందో వివ‌రించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని స‌రిగా చేయ‌నివారు ఎవ‌రైనా స‌రే వచ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ టికెట్ ఇచ్చేది లేద‌ని ఖ‌రాఖండీగా తేల్చిచెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జులు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం అంటూ త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే చాలా చోట్ల వీరికి ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న సెగ ఎదుర‌వుతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వివిధ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌లేద‌ని, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నార‌ని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. దీంతో అధికార పార్టీ నేత‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాజాగా క‌ర్నూలు జిల్లా ఆదోనిలో అధికార పార్టీ ఎమ్మెల్యే సాయిప్ర‌సాద్ రెడ్డికి ఒక మ‌హిళ సెగ త‌గిలింది. త‌న‌కు ఇంత‌వ‌ర‌కు ఇంటి ప‌ట్టా రాలేద‌ని.. ప‌ట్టా ఇవ్వ‌క‌పోతే మీ ఇంటికి వ‌చ్చి కూర్చుంటాన‌ని ఆ మ‌హిళ వార్నింగ్ ఇచ్చింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ఆదోని పట్టణం 18వ వార్డులో ఎమ్మెల్యే సాయిప్రసాద‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ నేప‌థ్యంలో ఒక మ‌హిళ ఇప్ప‌టికే ప‌లుమార్లు తాను ఇంటికోసం వ‌లంటీర్ల‌కు, స‌చివాల‌య సిబ్బందికి ద‌రఖాస్తులిచ్చానని.. అయినా త‌న‌కు ఇళ్లు రాలేద‌ని ఎమ్మెల్యేను నిల‌దీసింది. త‌న‌కు ఇంటి ప‌ట్టా ఇవ్వ‌క‌పోతే మీ ఇంటికొచ్చి కూర్చుంటాన‌ని వార్నింగ్ ఇవ్వ‌డంతో త‌ప్ప‌కుండా ఇస్తామ‌ని చెప్పి ఎమ్మెల్యే అక్క‌డి నుంచి జారుకున్న‌ట్టు చెప్పుకుంటున్నారు.

అలాగే ఒక వృద్ధురాలు ప్ర‌భుత్వం క‌రెంటు చార్జీలు విప‌రీతంగా పెంచేసింద‌ని.. వీటితో పేద‌లు ఎలా బ‌త‌కాల‌ని ఎమ్మెల్యేని నిల‌దీసింది. త‌మ ఇంట్లో రెండు బ‌ల్బులు, టీవీ మాత్ర‌మే ఉన్నాయ‌ని.. క‌రెంటు బిల్లు మాత్రం రూ.1900 వ‌చ్చింద‌ని ఆయ‌న దృష్టికి తెచ్చింది. అలాగే చెత్త ప‌న్నును కూడా ఒకేసారి ఆరు నెల‌ల‌కు క‌లిపి చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీంతో త‌ప్ప‌కుండా ప‌రిశీలిస్తామ‌ని చెప్పి ఎమ్మెల్యే సాయిప్ర‌సాద‌రెడ్డి వెళ్లిపోయార‌ని అంటున్నారు.