Begin typing your search above and press return to search.

అయ్య‌ప్ప ఎంట్రీకి ఆధార్‌ కు లింకెట్టేశారు!

By:  Tupaki Desk   |   5 Jan 2018 10:29 AM GMT
అయ్య‌ప్ప ఎంట్రీకి ఆధార్‌ కు లింకెట్టేశారు!
X
శ‌బ‌రిమ‌ల ఆల‌య బోర్డు (ట్రావెన్ కోర్‌) సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది. శ‌బ‌రిమ‌ల‌లో అయ్య‌ప్ప‌స్వామి ద‌ర్శ‌నం చేసుకోవాల‌నుకునే మ‌హిళ‌లు త‌ప్ప‌నిస‌రిగా త‌మ ఆధార్ లేదంటే.. వ‌య‌సు ధ్రువీక‌ర‌ణ స‌ర్టిఫికేట్‌ను త‌ప్ప‌నిస‌రిగా చూపించాల్సి ఉంటుంది. శ‌బ‌రిమ‌ల‌లో మ‌హిళా భ‌క్తుల ద‌ర్శ‌నంపై ప‌రిమితులు ఉన్న సంగ‌తి తెలిసిందే.

సాధార‌ణంగా శ‌బ‌రిమ‌ల‌లో అయ్య‌ప్ప‌స్వామిని మ‌హిళ‌లు ద‌ర్శ‌నం చేసుకోవాలంటే ప‌న్నెండు సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సులో కానీ.. 50 ఏళ్ల త‌ర్వాత మాత్ర‌మే అనుమ‌తిస్తారు. 12-50 మ‌ధ్య వ‌య‌స్కుల్ని అనుమ‌తించరు. దీనికి కార‌ణం లేక‌పోలేదు. శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి నైష్ఠిక బ్ర‌హ్మ‌చారి కావ‌టంతో రుతుక్ర‌మంలో ఉన్న స్త్రీలు ఆల‌యంలోకి ప్ర‌వేశించేందుకు అనుమ‌తించ‌రు.

అయితే.. కొంద‌రు మ‌హిళ‌లు అందుకు విరుద్ధంగా స్వామి ద‌ర్శ‌నాన్ని చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో.. అలాంటివి చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా ట్రావెన్ కోర్ దేవ‌స్థానం బోర్డు కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. ద‌స‌రా మొద‌లుకొని జ‌న‌వ‌రి 14న మ‌క‌ర‌విళుక్కు పండ‌గ‌తో ముగిసే అయ్య‌ప్ప సీజ‌న్ సంద‌ర్భంగా భారీ ఎత్తున భ‌క్తులు వ‌స్తుంటారు.

వ‌య‌సు ఆధారంగా మ‌హిళ‌ల్ని అనుమ‌తించే విష‌యంలో ఎదుర‌వుతున్న ఇబ్బందుల నేప‌థ్యంలో.. ఇక‌పై మ‌హిళా భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా త‌మ వ‌య‌సును తెలియ‌జేసే ధ్రువ‌ప‌త్రాన్ని త‌ప్ప‌నిస‌రిగా అధికారుల‌కు చూపించాల్సి ఉంటుంది. ఆధార్ తో పాటు మ‌రేదైనా ధ్రువ‌ప‌త్రాన్ని చూపించిన త‌ర్వాతే శ‌బ‌రిమ‌ల కొండకు వెళ్లేందుకు అనుమ‌తిస్తార‌ని చెబుతున్నారు. పంబ నుంచి బ‌య‌లుదేరే మ‌హిళా భ‌క్తులు అక్క‌డి భ‌ద్ర‌తా సిబ్బందికి ఆధార్ తో స‌హా మ‌రేదైనా ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని చూపించాకే కొండ మీద‌కు వెళ్లేందుకు అనుమ‌తిస్తారు.