Begin typing your search above and press return to search.

ఇదేంది కేసీఆర్? కన్నీళ్లు పెట్టిస్తున్న పోడు రైతుల జైలుకథలు

By:  Tupaki Desk   |   12 Aug 2021 9:21 AM IST
ఇదేంది కేసీఆర్? కన్నీళ్లు పెట్టిస్తున్న పోడు రైతుల జైలుకథలు
X
వారంతా కరుడుగట్టిన నేరస్తులు కాదు. ఆ మాటకు వస్తే నేరమయ జీవితాలకు వారికి ఏ మాత్రం సంబంధం లేదు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్తత వారిని జైలుపాలు చేసింది. అన్నదాతలైన వారికి ఎదురైన చేదు అనుభవాలు వేదనాభరితంగా ఉండటమే కాదు.. మరీ ఇంత దారుణమా? అన్న భావన కలుగక మానదు. చంటి పిల్లల తల్లులన్న కనికరం లేకుండా జైల్లో వారికి ఎదురైన ఇబ్బందుల గురించి మహిళా రైతుల మాటలు వింటే షాక్ తినాల్సిందే. వారికి ఎదురైన కష్టాలకు కన్నీళ్లు రావాల్సిందే. ఇంతకూ వారు జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వారికి ఎదురైన కష్టాల్ని చూస్తే..

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో ఎల్లన్ననగర్ లో ఈ నెల ఆరున పోడు భూముల విషయంపై అటవీ శాఖ ఉద్యోగులకు.. పోడు రైతులకు మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తమపై దాడి చేశారంటూ అటవీశాఖ అధికారులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మొత్తం 23 మందిపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. వారిలో 18 మంది మహిళలు ఉండగా.. ముగ్గురు పసిపిల్లల తల్లులు. వారిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చగా.. వారిని రిమాండ్ కు తరలించారు.

ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో వీరిపై నమోదు చేసిన హత్యాయత్నం సెక్షన్లను ఉపసంహరించుకున్నారు పోలీసులు. దీంతో వీరికి బెయిల్ మంజూరైంది. బుధవారం వీరంతా జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన మహిళా రైతులు.. వారి కుటుంబాల వారిని చూసి తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. ఐదు రోజుల పాటు జైల్లో ఉన్న వారు.. తమ పిల్లల్ని చూసుకున్న తల్లులు కన్నీరు పెట్టుకున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. జైల్లో తామున్న ఐదు రోజుల పాటు జైలు సిబ్బంది తమను ఇబ్బందులకు గురి చేసినట్లు వాపోయారు. అంతేకాదు.. మహిళలని చూడకుండా కొట్టారని.. బూతులు తిట్టి బెదిరింపులకు పాల్పడినట్లుగా ఆరోపిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. తమ చేత జైల్లోని బాత్రూంలు కడిగించినట్లు వాపోయారు.

తమ వారికి జైల్లో ఎదురైన పరిస్థితులపై వారి కుటుంబాల వారు ఆందోళన చేపట్టారు. దీంతో జైలు సూపరిండెంట్ కలుగజేసుకొని.. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతామని.. తప్పులు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏమైనా మహిళా రైతులకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.