Begin typing your search above and press return to search.

ఇదెక్కడి అనాగరికం..అలా చనిపోతే చెట్టుకు కట్టేసి వచ్చేయటమా?

By:  Tupaki Desk   |   29 Jun 2020 11:00 AM IST
ఇదెక్కడి అనాగరికం..అలా చనిపోతే చెట్టుకు కట్టేసి వచ్చేయటమా?
X
కొన్ని ఉదంతాలు విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. మనమిప్పుడు ఎక్కడ ఉన్నామన్న భావన కలుగక మానదు. తాజాగా వెలుగు చూసిన అనాగరిక చర్య ఈ కోవకే వస్తుంది. గర్భవతి మరణించిన ఉదంతంలో అంత్యక్రియలు చేయకూడదన్న గ్రామస్థుల అభ్యంతరాలతో అడవిలో చెట్టుకు కట్టేసి వచ్చిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటి రోజుల్లో ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతారా? అన్నది ప్రశ్నగా మారింది. హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లెకు చెందిన ధర్మేంద్రకు ఏడాదిన్నర క్రితం లావణ్య అనే ఇరవైఏళ్ల అమ్మాయితో వివాహమైంది. ఇప్పుడామె నిండు గర్భిణి. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రసవం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల నిర్లక్ష్యంతో ఆమె ప్రాణాలు పోయాయి. ప్రసవం కాకుండానే మరణించిన లావణ్యను ఆమె కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.

అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తుండగా.. గ్రామస్తులు అడ్డుకున్నారు. నిండు చూలాలు ప్రసవం కాకుండా మరణించినప్పుడు అంత్యక్రియలుచేయకూడదని.. అదేమాత్రం మంచిది కాదని అడ్డుకున్నారు. అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో.. ఆమె భౌతికకాయాన్ని నల్లమల అడవిలోకి తీసుకెళ్లి.. ఒక చెట్టుకు కట్టేసి వచ్చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా రుద్రవరం.. గోనంపల్లె.. అప్పనపల్లె గ్రామాల ప్రజలు పొలం పనుల్లో భాగంగా అడవి గుండా వెళ్లారు.

ఈ క్రమంలో వారికి దారి పొడుగునా పూలు చల్లి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆందోళనతో అటువైపు వెళ్లగా.. అక్కడ చెట్టుకు ఒక మహిళ డెడ్ బాడీని కట్టేసి ఉన్న వైనానని చూసి భయాందోళనకు గురయ్యారు. అధికారులకు ఈ సమాచారాన్ని అందించారు. రంగంలోకి దిగిన వారు ఆరా తీస్తే.. ఈ అనాగరిక చర్య బయటకు వచ్చింది. ఇప్పటి రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతారా? అన్నది విస్మయంగా మారింది. గ్రామస్తులతో మాట్లాడి.. అంత్యక్రియలు చేయిస్తామని స్థానిక పోలీసులు చెబుతున్నారు.