Begin typing your search above and press return to search.

మసీదుల్లోకి వచ్చి మహిళలు ప్రార్థనలు చేయొచ్చు

By:  Tupaki Desk   |   30 Jan 2020 10:10 AM IST
మసీదుల్లోకి వచ్చి మహిళలు ప్రార్థనలు చేయొచ్చు
X
మసీదుల్లోకి మహిళలు వచ్చి ప్రార్థనలు చేయొచ్చా? అందుకు ఏమైనా పరిమితులు ఉన్నాయా? లాంటి సందేహాల పై తాజాగా స్పష్టత వచ్చేసింది. మసీదుల్లోకి పురుషుల మాదిరే ముస్లిం మహిళలు వచ్చి ప్రార్థనలు చేయటం ఇస్లాం లో ఆమోదనీయమేనని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు తాజాగా వెల్లడించింది. ముస్లిం పురుషుల మాదిరే మహిళలు సైతం నమాజ్ చేయటానికి మసీదుల్లోకి రావొచ్చని స్పష్టం చేసింది.

మసీదుల్లోకి మహిళల్ని అనుమతించాలని ఆదేశించాలని కోరుతూ యాస్మీన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. శబరిమలతో సహా కొన్ని మతపరమైన ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష నేపథ్యం లో ఈ పిటిషన్ దాఖలైంది. దీనిపై తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరుపుతోంది.

ఇదిలా ఉంటే.. మసీదుల్లోకి వచ్చి మహిళలు ప్రార్థనలు చేయటం ఇస్లాంలో ఆమోదనీయమేనని లా బోర్డు స్పష్టం చేసింది. మహిళలు మసీదుల్లోకి స్వేచ్ఛగా రావొచ్చని.. అయితే రావాలా? వద్దా? అన్నది నిర్ణయించుకునే హక్కు సదరు మహిళలకు ఉందని పేర్కొంది. ఒకవేళ దీనికి సంబంధించి విరుద్ధమైన మత పరమైన అభిప్రాయాలు ఉంటే తాము స్పందించాలనుకోవటం లేదని పేర్కొంది.

మహిళలు కచ్ఛితంగా సామూహిక ప్రార్థనల్లో పాల్గొనాలని కానీ.. శుక్రవారం ప్రార్థనల్లో పాలు పంచుకోవాలన్న అంశాలేమీ ఇస్లాంలో లేవని కోర్టుకు తెలిపారు. మసీదుల్లో కానీ.. ఇంట్లో కానీ ముస్లిం మహిళలు ప్రార్థనలు చేసే వీలుందని చెప్పారు.