Begin typing your search above and press return to search.

సహజీవనం హత్య వరకూ వెళ్లింది

By:  Tupaki Desk   |   10 Dec 2015 1:30 PM IST
సహజీవనం హత్య వరకూ వెళ్లింది
X
బంధించేలా ఉంచుతుందని వివాహ వ్యవస్థ మీద కొందరు విమర్శలు చేస్తుంటారు. అందుకే.. తాము పెళ్లిళ్లు చేసుకోకుండా సహజీవనం చేస్తున్నట్లు చెప్పుకునే వారు ఈ మధ్యన పెరిగారు. సహజీవనంలోనూ తిప్పలు తప్పవన్న విషయంతో పాటు.. ఇలాంటి వాటిల్లో చోటు చేసుకున్న క్రైం చూస్తే కళ్లు తిరగక మానదు. సహజీవనంలో తన పార్టనర్ పెట్టే టార్చర్ భరించలేని ఒక మహిళ.. దారుణంగా హత్య చేసింది. ఆపై దొరికిపోయి.. ఇప్పుడు జైలుపాలైంది. దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఈ ఉదంతం చూస్తే..

నీతూ.. యోగేంద్ర సింగ్ ఇద్దరూ ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే.. యోగేంద్రసింగ్ కాస్త భిన్నమైనవాడు. పైసా సంపాదించడు. కానీ.. డబ్బు కోసం పార్టనర్ని చిత్రహింసలు పెడుతుంటాడు. తాగి వచ్చి డబ్బుల కోసం డిమాండ్ చేయటం దగ్గర నుంచి చాలానే టార్చర్ ఉంటుంది. ఇతగాడి హింసను తట్టుకోలేని నీతూ.. ఒక దారుణమైన ప్లాన్ వేసింది. పార్టనర్ ని వదిలించుకునేందుకు 18 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ రోహిత్ తోపాటు.. పొరుగున ఉండే మరో మహిళ సాయాన్ని కోరింది.

ముగ్గురు కలిసి యోగేంద్రసింగ్ ను లేపేయాలని ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లే ఒక మందు పార్టీ అరేంజ్ చేశారు. పార్టీ అన్న వెంటనే యోగేంద్రసింగ్ ముందు వెనుకా చూడకుండా ఓకే చెప్పేసి.. ఫుల్ గా తాగేసి పడిపోయాడు. వెంటనే.. అతడి గొంతు నులిమి చంపేసి.. ఆ పై ఢిల్లీ శివారుల్లోకి తీసుకెళ్లి పడేశారు. అతడి ఆనవాళ్లు కనిపించకూడదన్న ఉద్దేశంతో అతని ముఖాన్ని బండరాయితో కొట్టేసి.. ఏమీ తెలీనట్లు వెళ్లిపోయారు.

మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ జరిపారు. యోగేంద్రసింగ్ ఆనవాళ్లను గుర్తించటంతో.. అతగాడు నీతూతో సహజీవనం చేస్తున్న విషయం బయటకు వచ్చేసింది. పోలీసులకు సందేహం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరపటంతో తాము చేసిన వెధవ పనిని వివరంగా చెప్పుకొచ్చింది. తాను ఏ పరిస్థితుల్లో ఈ పని చేసిందో చెప్పింది. ఏ పరిస్థితుల్లో చేసినా.. హత్య హత్యే అన్న విషయాన్ని మర్చిపోయి నీతూ.. ఆమె మాటల్ని నమ్మిన మిగిలిన ఇద్దరూ ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నారు.