Begin typing your search above and press return to search.

పెళ్లిలో అందరి దృష్టంతా ఆమెపైనే

By:  Tupaki Desk   |   8 Feb 2020 11:00 PM IST
పెళ్లిలో అందరి దృష్టంతా ఆమెపైనే
X
మహిళలు ఆకాశంలో సగంగా వర్ధిల్లుతున్నారు. రంగం ఏదైనా సత్తా చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పొట్టకూటి కోసం ఏ పనైనా చేయడానికి మహిళలు ముందడుగు వేస్తున్నారు. గతంలో కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన పనులు ఇప్పుడు మహిళలు కూడా చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ వృత్తుల్లో రాణిస్తున్నారు. ఇప్పటికే క్షవరం, బ్యాండ్ మేళంలో మహిళలు అరంగేట్రం చేశారు. తాజాగా పురోహిత్యంలో కూడా మహిళలు రాణిస్తున్నారు. తాజాగా చెన్నైలో ఓ వివాహాన్ని ఓ మహిళా జరిపించి హాట్ టాపిక్ గా నిలిచింది.

వేద మంత్రాలను అనర్గళంగా.. స్పష్టంగా పలుకుతూ వివాహ తంతు జరిపించింది. ఆమెనే కర్నాటకలోని మైసూర్ కు చెందిన భ్రమరాంబ మహేశ్వరి. తమిళనాడులోని చెన్నై శివారు ప్రాంత‌మైన ద‌క్షిణ చిత్ర‌లో తెలుగు అమ్మాయి సుష్మా హ‌రిణి, త‌మిళ అబ్బాయి విఘ్నేశ్ రాఘ‌వ‌న్‌ పెళ్లి జరిగింది. పూజారిగా మహేశ్వరి అన్ని కార్యక్రమాలు సక్రమంగా.. సంప్రదాయ పద్ధతిలో చేయించారు. బ్రమరాంభ కేవలం మంత్రాలు చదివి పెళ్లిళ్లు చేయటమే కాదు ఆ మంత్రాలకు అర్థం కూడా చెబుతారు. వేదమంత్రాలు ఆమెకు కొట్టిన పిండి. చక్కటి ఉచ్ఛారణతో మంత్రాలు చదువుతూ వాటికి అర్థం, పరమార్థం చెబుతూ ఆకట్టుకుంటున్నారు. అందుకే ఆమెతో పెళ్లిళ్లు చేయించుకోవటానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు.

ఈ క్రమంలో కొత్తజంట సుష్మ హరిణి, విఘ్నేశ్ రాఘవన్ ఆమెను సంప్రదించారు. ప్రత్యేకంగా తమ పెళ్లి ఉండాలనే ఉద్దేశంతో పెళ్లి పనులన్నీ మహిళలతో చేయించాలని తొలుత భావించారు. ఆ మేరకు మ‌హిళా నాద‌స్వ‌ర‌, మృదంగ బృందాల‌ను కూడా ఏర్పాటుచేయాల‌ని అనుకున్నారు. కానీ వారికి మహిళ బృందాలు దొర‌క‌లేదు. కానీ మ‌హిళా పూజారి బ్ర‌మ‌రాంబ ఒక్కరే లభించడం తో ఆమె పెళ్లి తంతు చేయించారు. అయితే పెళ్లికి వచ్చిన అతిథులు, బంధుమిత్రుల దృష్టంతా భ్రమరాంబ మహేశ్వరి వైపు పడింది.

మ‌హిళా పూజారుల‌ను ప్రోత్స‌హించాల‌న్న ఉద్దేశంతో బ్ర‌మ‌రాంబ‌ ను ఆహ్వానించిన‌ట్లు పెళ్లి కూతురు సుష్మ తండ్రి సురేశ్ రెడ్డి తెలిపారు. అన్ని రంగాల్లోను తమదైన ముద్ర వేస్తు జయకేతనాలు ఎగురవేస్తున్న మహిళలు పాత సంప్రదాయాలకు స్వస్తి చెబుతున్నారు. మంత్రాలు.. వేదాలు మహిళలు చదవకూడదు అనేది పాతకాలపు మాట.. వాటికి చరమ గీతం పాడుతూ మహిళలు ముందడుగు వేస్తున్నారు. ఆలయాల్లో పూజారులు గా కూడా నేడు మహిళలు సేవలందిస్తున్న విషయం తెలిసిందే.. నింగీ నేలా మాదేనంటున్నారు. పెళ్లిళ్లు..అ ర్చకత్వాలు పురుషులే చేయాలను సంప్రదాయాలకు చెల్లుచీటి ఇచ్చి తమదైన ముద్ర వేస్తూ..మహిళామణులు దూసుకుపోతుండడం ఆహ్వానించ దగ్గ పరిణామం.