కరోనా వేళ.. రేవ్ పార్టీ రచ్చ! మహిళా పోలీస్ ఏం చేసిందో తెలుసా?

Tue Apr 20 2021 12:00:01 GMT+0530 (IST)

woman police in rave party

ఊరు కాలిపోయి జనం ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు దొరికిందని సంబరపడ్డారట కొందరు! కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభణతో దేశం వణికిపోతుంటే.. దాదాపు 130 మందికిపైగా.. డ్రగ్స్ మద్యంతో ఒక్కచోట చేరి చిందేశారు! ఈ ఘటన కర్నాటకలోని హసన్ జిల్లాలో వెలుగు చూసింది.అలూరు తాలుకా పరిధిలోని ఓ రిసార్టులో ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్టు సమాచారం. కొన్ని రోజులుగా అందరినీ గేదర్ చేసిన నిర్వాహకులు.. సోమవారం ప్లాన్ చేశారు. ఈ పార్టీకి బెంగళూరుతోపాటు గోవా మంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన వారు హాజరైనట్టు తెలుస్తోంది.

ఈ పార్టీలో నిషేధిత డ్రగ్స్ మద్యం తీసుకుంటూ మైమరచిపోయి చిందేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి రేవ్ పార్టీని భగ్నం చేశారు. అయితే.. వారికి ఊహించని షాక్ ఎదురైంది. ఇలాంటి పార్టీని అడ్డుకోవాల్సిన ఓ మహిళా పోలీసు కూడా వారితో చేరి తాగి తందనాలు ఆడటం గమనార్హం. ఈ పార్టీలో పాల్గొనేందుకు ఆమె సెలవు పెట్టిమరీ వచ్చారట.

రేవ్ పార్టీలో పాల్గొన్న 130 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిసార్టు వద్ద పార్క్ చేసిన 50 ద్విచక్రవాహనాలు 20 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న మహిళా పోలీసును సస్పెండ్ చేసినట్లు అధికారులు ప్రకటించినట్టు సమాచారం.