Begin typing your search above and press return to search.
లక్ష్మీనారాయణ భార్యనంటూ మహిళ హల్ చల్!
By: Tupaki Desk | 5 April 2018 4:24 PM ISTకొద్ది రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ....రాజకీయ అరంగేట్రంపై పలు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని - త్వరలోనే తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని ఆయన స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఆ పుకార్లు సద్దుమణిగాయి. తాజాగా, ఆయనకు సంబంధం లేకుండానే లక్ష్మీనారాయణ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. తాను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యనంటూ ఓ మహిళ హల్ చల్ చేసింది. ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. చంద్రబాబు ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎర్విన్ రీటా అనే మహిళను పోలీసులు ప్రశ్నించారు. సచివాలయానికి వెళుతున్నానని చెప్పిన రీటాపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను ప్రశ్నించారు. దీంతో, తాను సీబీఐ అధికారిని అని కొద్ది సేపు...తాను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యనని కొంతసేపు సమాధానం చెప్పింది. ఆమె మానసిక స్థితి సరిగా లేదని భావించిన పోలీసులు రీటాను అదుపులోకి తీసుకున్నారు. రీటా దగ్గర ఉన్న ఓ పత్రంలో ఆమె పేరు ఎర్విన్ రీటా అని - భర్త పేరు వీవీ లక్ష్మీనారాయణ అని ఉంది. ప్రస్తుతం రీటా నుంచి మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
