Begin typing your search above and press return to search.

కార్తీక్... భార్య సీక్రెట్ ను బయట పెట్టాడు!

By:  Tupaki Desk   |   25 July 2016 1:27 PM GMT
కార్తీక్... భార్య సీక్రెట్ ను బయట పెట్టాడు!
X
అబద్దపు మాటలు చెప్పి మోసం చేసిందనేది కారణమో లేక పవిత్రమైన వృత్తికి ద్రోహం చేస్తుందనే కోపమో తెలియదు కానీ.. తన భార్య చేసే దారుణాలను బయట ప్రపంచానికి చెబుతూ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు ఒక భర్త. విషయానికొస్తే.. తమిళనాడుకు చెందిన కార్తీక్ - అర్చనలకు కొన్ని రోజుల క్రితం పెళ్లి జరిగింది. అప్పటికే డాక్టర్ అయిన కార్తీక్.. తాను కూడా ఒక వైద్యురాలినే వివాహం చేసుకోవాలనుకున్నాడు! అనుకున్నట్లే అర్చన అనే వైద్యురాలిని వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత భార్య ప్రవర్తనపైన అనుమానం వచ్చిన కార్తీక్ ఆదిశగా ఆరాతీయడం మొదలు పెట్టాడు.. ఫలితం షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అతడు సందేహించినట్లుగానే అర్చన నిజంగా డాక్టర్ కాదు. నకిలీ ధ్రువ పత్రాలతో వేరొకరి పేరు మీద డాక్టర్ గా కొనసాగుతుంది. ప్రభుత్వ అధికారి అయిన అర్చన తండ్రి.. డాక్టర్ కావాలన్న కూతురు కోరికను తీర్చడానికి తానే నకిలీ పత్రాలు సృష్టించాడు. 2003లో చనిపోయిన తమిజ అనే వైద్యురాలి పేరు మీద కూతురిని డాక్టర్ గా చలామణి చేయిస్తున్నాడు.

అయితే విషయం కార్తీక్ కు తెలియడంతో భార్య అని చూడకుండా - స్వార్ధం ఆలోచించకుండా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సీ.ఐ)కు ఫిర్యాదు చేశాడు. దీంతో విషయం పోలీసుల ద్రుష్టికి వెళ్లడంతో క్రిమినల్ కేసు నమోదు చేశారు. తప్పుచేసింది భార్య అని తెలిసి కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయకుండా సీక్రెట్ బయటపెట్టిన కార్తీక్ ను పలువురు అభినందిస్తున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే... వైద్యురాలిగా చలామని అవుతున్న అర్చన ఇంటర్ కూడా పాస్ కాలేదు!