Begin typing your search above and press return to search.

యువ‌తి మ‌ర‌ణంపై కాటికాప‌రి అనుమానం: పోలీసుల ఎంట్రీతో మారిన సీన్‌

By:  Tupaki Desk   |   5 Jun 2020 8:30 PM IST
యువ‌తి మ‌ర‌ణంపై కాటికాప‌రి అనుమానం: పోలీసుల ఎంట్రీతో మారిన సీన్‌
X
24 ఏళ్ల యువ‌తి ఫిట్స్‌తో మ‌ర‌ణించింద‌ని చెప్పి అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఆక‌స్మిక మృతిపై బంధువులు అనుమానం వ‌చ్చినా వాటిని క‌ప్పిపుచ్చేసి అంత్య‌క్రియ‌లు పూర్తి చేద్దామ‌నుకున్న స‌మ‌యంలో కాటి కాప‌రి ప్ర‌వేశంతో సీన్ రివ‌ర్స్ అయ్యింది. కాటి కాప‌రి యువ‌తి మ‌ర‌ణంపై అనుమానాలు వ్య‌క్తం చేయ‌డంతో పాటు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు. యువ‌తి మృత‌దేహంపై గాయాలు, జుట్టు క‌త్తిరించి ఉంద‌ని పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్ట‌ణం అక్కయ్యపాలెం ప్రాంతంలో జ‌రిగింది.

అక్కయ్యపాలెం చెక్కుడురాయి బిల్డింగ్‌ సమీపం లో నివసిస్తున్న గుట్టల వసంత (29)కు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెనికి చెందిన దివ్య (22) ఆరు నెలల కిందట ద్వారకా బస్‌స్టేషన్‌ వద్ద పరిచయమైంది. భర్త దుబాయ్‌ లో ఉంటుండడం తో వ‌సంత ఆమెను తీసుకుని తన ఇంటికి వెళ్లింది. అప్పటి నుంచి దివ్య ఆమె వ‌ద్ద‌నే ఉంటోంది. బుధవారం రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ... గురువారం తెల్లవారేసరికి దివ్య ఫిట్స్‌తో మృతిచెందిందంటూ వసంత తన బంధువులకు సమాచారం అందించింది. వారంతా వచ్చి ఇంటి ముందు టెంట్‌ వేసి, దివ్య మృత దేహాన్ని పూలతో కప్పేశారు. స్థానికులకు కూడా అదే విషయం చెప్పింది. అయితే ఆమె మృతి పై ప‌లువురికి అనుమానం వ‌చ్చినా బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. అయితే మ‌రికొంద‌రు యువ‌తి మృతిపై పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పంద‌న లేదు.

ఈ క్ర‌మంలో మృత‌ దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌డానికి జ్ఞానాపురంలోని శ్మశాన వాటిక కాటి కాపరికి సమాచారం అందించారు. ఈ సంద‌ర్భంగా మృతురాలి వివరాలు కాటికాపరి తెలుసుకున్నాడు. ఆ వివ‌రాలు విన్న కాటికాప‌రి అనుమానం వ్య‌క్తం చేశాడు. 22 ఏళ్ల మహిళ ఫిట్స్‌తో మృతిచెందడమేమిటని అనుమానం మొద‌ల‌వ‌డంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఇంటికి వ‌చ్చి మృత‌దేహం ప‌రిశీలించారు. యువతి ముఖం, వీపు ఇతర శరీర భాగాలపై సిగరెట్‌తో వాతలు పెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో పాటు మృతురాలి జుట్టు కత్తిరించి ఉండ‌డం తో క్లూస్‌ టీమ్‌, డాగ్‌స్క్వాడ్‌ తో ఆధారాలు సేకరించారు. కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.

ఈ కేసులో వసంతతోపాటు ఆమె సోదరి మంజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కేసు విచార‌ణలో భాగంగా తేలిన విష‌య‌మేమిటంటే వ్యభిచారానికి సంబంధించిన లింకులు ఉన్నట్టు తేలింది. అయితే దీనిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. దీనిపై పూర్తి విచార‌ణ చేసి త్వ‌ర‌లోనే వాస్త‌వాలు ఏమిటో చెబుతామ‌ని పోలీసులు చెబుతున్నారు.