Begin typing your search above and press return to search.

ఇలా ప్రణబ్ కే సాధ్యమవుతుందేమో?

By:  Tupaki Desk   |   20 Aug 2015 11:12 AM IST
ఇలా ప్రణబ్ కే సాధ్యమవుతుందేమో?
X
దశాబ్దాల తరబడి కలిసి బతికిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే.. ఆ బాధ నుంచి బయటపడటానికి కొంత కాలం పడుతుంది. కానీ.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అలాంటి భావోద్వేగాలకు అతీతం అన్నట్లుగా వ్యవహరిస్తూ.. పలువురిని విస్మయానికి గురి చేస్తున్నారు.

దేశ ప్రధమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ అనారోగ్యంతో కన్నుమూయటం తెలిసిందే. ఆమె అంత్యక్రియలు పూర్తి అయిన కొన్ని గంటల వ్యవధి లోనే తన విధి నిర్వహణలో నిమగ్నం కావటం పలువురిని విస్మయానికి గురి చేసింది. కట్టుకున్న భార్య చనిపోయినా.. ఆ బాధను కడుపులోనే ఉంచుకొని.. తన వ్యక్తిగత అంశాల కారణంగా అధికారిక కార్యక్రమాలు ఏవీ వాయిదా పడకూడదన్నట్లుగా ఆయన కార్యక్రమాల్లో మునిగిపోయారు.

అంత్యక్రియలు ముగిసిన త‌ర్వాత మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ జ‌యంతి స‌భ‌లో పాల్గొన్నారు. అక్క‌డ ప్ర‌సంగించిన త‌ర్వాత.. షెడ్యూల్ లోని కార్యక్రమాలన్నింటికి ఆయన హాజరయ్యారు. అంతేకాదు.. గురువారం జరగాల్సిన భారత్.. పసిఫిక్ దీవుల సహకార ఫోరం సదస్సు నిర్వహణ అంశంపై కూడా చర్చించారు. 58 ఏళ్లగా త‌న‌కు తోడు నీడగా నిలిచిన అర్థాంగి.. అనంత లోకాలకు వెళ్లిపోయినా.. ఆ బాధను కడుపులో పెట్టుకొని.. బయటకు రానివ్వకుండా అధికారిక కార్య‌క్ర‌మాల్లో అదే గంభీర‌త‌తో పని చేయటం ప్రణబ్ కి మాత్ర‌మే సాధ్యమవుతుందేమో.