Begin typing your search above and press return to search.

వైఎస్సార్టీపీ బీజేపీలో విలీనమా...?

By:  Tupaki Desk   |   6 Oct 2022 11:30 AM GMT
వైఎస్సార్టీపీ బీజేపీలో విలీనమా...?
X
తెలంగాణాలో ఇపుడు సరికొత్త సన్నివేశం చోటు చేసుకోబోతుందా. వైఎస్సార్ తనయ, ఏరికోరి మరీ పెట్టిన తన పార్టీని ఇక నడపలేరా. ఆమె ఆశలు ఆశయాలకు తగిన విధంగా తెలంగాణాలో రాజకీయ కధ సాఫీగా సాగడంలేదా అంటే జవాబు మాత్రం అవును అనే వస్తోంది అంటున్నారు. ఇక తెలంగాణాలో దాదాపుగా రెండేళ్ల క్రితం పార్టీ పెట్టి చాలా నెలలుగా పాదయాత్ర చేస్తూ వందల కిలోమీటర్ల దూరాన్ని కొలుస్తూ వస్తున్న షర్మిలకు ఏ మైలు రాయి వద్దా కూడా ఆశాజనకంగా రాజకీయ పరిస్థితి లేదు అంటున్నారు.

పార్టీ పెట్టిన తరువాత ఆమె ఒంటరి పోరే చేస్తున్నారు. ఏ ఒక్క కీలకమైన నాయకుడూ వచ్చి ఆమె పార్టీలో చేరడంలేదు అని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో షర్మిల పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా అన్న చర్చ కూడా ఇపుడు ముందుకు వస్తోంది. ఆమె రాజకీయ పార్టీని పెట్టిన తరువాత తెలంగాణాలో కేసీయార్ మీదనే గురి పెట్టి ఉంచారు. ఆమె మధ్య మధ్యలో కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్నా పూర్తి ఫోకస్ మాత్రం కేసీయార్ మీదనే అంటున్నారు.

ఇక కేసీయార్ కొత్తగా జాతీయ పార్టీ పెట్టి ఆ ఆనందంలో ఉన్న వేళ షర్మిల ఢిల్లీ యాత్ర చేయడం విశేషంగానే చూస్తున్నారు. షర్మిల ఢిల్లీ టూర్ లో కేసీయార్ ప్రభుత్వం మీద అవినీతి మీద కేంద్ర హోం శాఖకు అలాగే సీబీఐకి ఫిర్యాదు చేయడానికి అని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో అక్రమాలతో పాటు అనేక పధకాల్లో అవినీతి కార్యక్రమాల ద్వారా కేసీయార్ బాగా పోగేసుకున్నారని ఆయన మీద సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల కోరబోతున్నారుట.

చూడబోతే ఇది సంచలనమే అని చెప్పాలి. ఇప్పటిదాకా బీజేపీ నేతలు కేసీయార్ మీద అనేక రకాలైన అవినీతి ఆరోపణలు చేశారు కానీ వారు మాత్రం ఎక్కడా సీబీఐని కలసి ఫిర్యాదులు చేయలేదు. కానీ షర్మిల ఉన్న ఉదుటన ఢిల్లీ టూర్ పెట్టుకోవడం ఫిర్యాదులు చేయడం అంటే ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. అయితే ఇక్కడ మరో చర్చ కూడా వస్తోంది. షర్మిల ఢిల్లీకి వెళ్ళేది కేసీయార్ సర్కార్ అవినీతి మీద ఫిర్యాదు చేయడానికి అని బయటకు సాగుతున్న ప్రచారం అయినా ఆమె ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తారు అన్నది మరో ప్రచారంగా ఉంది.

అసలు విషయం ఇదే అని, ఆమె బీజేపీ వారికి ఇప్పటికే టచ్ లోకి వచ్చారని, అక్కడ కీలక మంతనాలు చేసేందుకే ఢిల్లీ వెళ్తున్నారని అంటున్నారు. తెలంగాణాలో బీజేపీని బలోపేతం చేద్దామని ఇప్పటికే ఆ పార్టీ తన వంతుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. కలసివచ్చిన వారిని అందరికీ కలుపుకుని పోతోంది.

ఇపుడు వైఎస్సార్ ఫ్యామిలీకి చెందిన షర్మిల అంటే చేర్చుకోవడానికి బీజేపీ కూడా సుముఖమే అని చెబుతున్నారు. షర్మిల విషయానికి వస్తే ఆమె తానుగా పార్టీని నడపలేకపోతున్నారు. ఇక తెలంగాణాలో బీజేపీకి ఉన్న రాజకీయ పరమైన అవసరాలు కూడా బాగా తెలుసుకున్న షర్మిల తమకు సీఎం పదవి ఇస్తే తప్పకుండా తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాను అని షరతు పెట్టబోతున్నారు అని అంటున్నారు.

షర్మిల ఢిల్లీ టూర్ సందర్భంగా ఇదే విషయాన్ని బీజేపీ కేంద్ర పెద్దలతో చర్చిస్తారు అని అంటున్నారు. మరి దానికి బీజేపీ పెద్దలు ఎంతవరకూ అంగీకరిస్తారు అన్నది చూడాలి. తెలంగాణాలో బీజేపీకి ఎంతో కొంత బలం ఉంది. పైగా బడా నాయకులు ఉన్నారు. బీజేపీ బయట నుంచి వచ్చి పార్టీలో చేరిన వారిని గౌరవిస్తుంది తప్ప కీలకమైన పదవులు ఎపుడూ ఇవ్వదు. ఎక్కడైనా ఒకటి రెండు ఉదంతాలు ఉంటే ఆ నాయకులు గట్టివారు కావడం వల్లనే అలా జరుగుతోంది. ఏపీలో చూస్తే పవన్ కళ్యాణ్ జనసేన మిత్రపక్షం అయినా ముఖ్యమంత్రిగా ఆయన పేరుని చెప్పడానికే బీజేపీ ఆలోచిస్తోంది.

అదే తెలంగాణా తమ రాజకీయ కార్యక్షేత్రంగా ఉంచుకుని ఏళ్ల తరబడి పనిచేస్తూ ఎంతో కొంత గెలుపు అవకాశాలు ఉంటాయని భావిస్తున్న బీజేపీకి షర్మిల షరతులు ఏ మాత్రం పట్టవనే అంటున్నారు. పైగా ఆమె పార్టీకి ఒక దశ దిశ లేవని కూడా భావిస్తున్నారు. ఆమె తప్ప వైఎస్సార్టీపీలో ఎవరున్నారు అన్నది కూడా బీజేపీ వారి మాటగా ఉంది అంటున్నారు. అయితే షర్మిల తామిగా వచ్చి చేరితే ఒక లీడర్ గా ఆమెను తీసుకుంటారు తప్ప సీఎం పదవిని ఆమెకు ఇస్తామని ఎలాంటి ఒప్పందం చేసుకోరనే అంటున్నారు

ఇక పార్టీని నడపడం తన వల్ల కాదని గ్రహించిన తరువాతనే షర్మిల ఈ రకమైన ఎత్తుగడలు వేస్తున్నారు అని కూడా బీజేపీ పెద్దలు గ్రహించారు అని అంటున్నారు. అందువల్ల షర్మిల పెట్టే కండిషన్లు కమలం పార్టీ వద్ద ఏ కోశానా అప్లై కావు అని చెబుతున్నారు. మరి షర్మిల ఏం చేస్తుంది అంటే ఆమెకే రాజకీయ అవసరం ఎక్కువగా ఉంది అని అంటున్నారు. అయినా సీఎం పోస్ట్ కోసం బీజేపీలోకి వెళ్లాలనుకోవడం ద్వారా షర్మిల రాజకీయంగా తన అస్థిత్వాన్ని పూర్తిగా కోల్పోతున్నారని అంటున్నారు.

ఆమె తండ్రి వైఎస్సార్ ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన వారు. ఆయన కాంగ్రెస్ తరఫున ఉండి బీజేపీ మీద అతి పెద్ద పోరాటం చేశారు. కాంగ్రెస్ తోనే ఆయన ఉన్నత పదవులు అందుకున్నారు. షర్మిల కనుక రాజకీయంగా రాణించాలి అంటే కాంగ్రెస్ లో చేరినా బెటర్ కానీ బీజేపీలోనా అన్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా రాంగ్ రూట్ లోనే షర్మిల రాజకీయం మొదలైంది. ఇపుడు ఆ కధ ఎటు సాగుతుందో కూడా తెలియదు అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.